నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. గొంతులో అన్నం ముద్ద అడ్డుపడటంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మార్కండేయ పురానికి చెందిన ర్యాలీ జెస్సి దివానా (2) అనే చిన్నారి మృతి చెందింది.
మధ్యాహ్నం సమయంలో తల్లి భాను శిరీష, నానమ్మ వెంకటరమణ పనిమీద బయటికి వెళ్లారు. ఈ సమయంలో తండ్రి ఆంజనేయులు కుమార్ చిన్నారికి ముద్దపప్పు అన్నం కలిపి తినిపిస్తున్నాడు.
అయితే, అన్నం తినే క్రమంలో అకస్మాత్తుగా అన్నం ముద్ద గొంతులో అడ్డుపడటంతో చిన్నారి ఊపిరాడక ఇబ్బంది పడింది. ఒక్కసారిగా బిక్కిరి అయి స్పృహ కోల్పోయిన చిన్నారిని గమనించిన తండ్రి వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారులకు ఆహారం తినిపించే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముద్దగా, పెద్ద ముక్కలుగా ఆహారం తినిపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ విషాద ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.



