– కమ్మర్లపల్లిలో మిన్నంటిన రోదనలు
నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపు (ట్యాంకు)లో పడి రెండున్నర ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గవ్వల పద్మ, రవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె అరుణ్ తేజ (2.5 ఏళ్లు) ఉంది. మంగళవారం ఉదయం నిద్రలేచిన చిన్నారి, ఇంట్లో ఆడుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో ఆవరణలో ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయింది.
కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి పద్మ, వెంటనే చిన్నారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే ఆడుకుంటూ కనిపించిన కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్నకోడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



