– చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి
– త్రిసభ్య కమిటీ విచారణ
– మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు : ఏపీ సీఎం చంద్రబాబు
– రూ.కోటి పరిహారం ప్రకటించాలి : సీపీఐ(ఎం)
విశాఖ, అమరావతి : విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఏటా జరిగే చందనోత్సవంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి అప్పన్నను దర్శించుకునే ందుకు వేల సంఖ్యలో భక్తులు కొండపైకి వచ్చారు. భారీ వర్షం కురవడంతో బుధవారం తెల్లవారుజామున ఇటీవలే నిర్మించిన ఒక గోడ కూలి రూ.300 క్యూలైన్‌లో ఉన్నవారిపై పడటంతో అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఒకరికి గాయాలయ్యాయి. కొండపై బస్టాండ్ ఎదురుగా వైకుంఠ ద్వారం వైపు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రమాదానికి కల కారణాలను వెలికితీసేందుకు త్రిసభ్య కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒకొక్కరికి 25 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన ఆదేశించారు. బుధవారం సాయంత్రం బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ప్రకటించాలని, ప్రమాదానికి కారణమైన గోడను నిర్మించిన కాంట్రాక్టరు, పనులను పర్యవేక్షించిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
ఏం జరిగింది…?
సింహాచలంలో బుధవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఇటీవలే నిర్మించిన రిటైనింగ్ గోడ (వాల్) కూలిపోయింది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే భక్తులు గోడ శిథిలాల కింద చిక్కుకున్నారు. బాధితుల, మిగిలిన యాత్రికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అక్కడికి సమీపంలోనే ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని గోడ కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్, హోం మంత్రి అనిత అక్కడకు చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని అంబులెన్సులో కేజీహెచ్‌కు తరలించారు.
మృతుల వివరాలు
1.పత్తి దుర్గాస్వామినాయుడు (29) మాచవరం తూర్పుగోదావరి జిల్లా,
2.ఎడ్ల వెంకటరావు (60) అడవివరం విశాఖపట్నం జిల్లా,
- కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(28) మాచవరం తూర్పుగోదావరి జిల్లా.
- గుజ్జరి మహాలక్ష్మి (65) హెచ్‌బికాలనీ వెంకోజీపాలెం (విశాఖపట్నం)
- పైలా వెంకటరత్నం (45), ఉమానగర్ వెంకోజీపాలెం,
- పిళ్లా శైలజ (26) చంద్రంపాలెం మధురవాడ (విశాఖపట్నం),
- పిళ్లా ఉమా మహేశ్వరరావు చంద్రంపాలెం మధురవాడ (విశాఖపట్నం)
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు…
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో మధురవాడ చంద్రంపాలేనికి చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ, ఆమె తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు కేజీహెచ్ వద్ద ఈ ఏడు మృతదేహాలకూ పోస్టు మార్టం నిర్వహించి వారి వారి బంధువులకు అప్పగించారు.
హడావిడిగా గోడ నిర్మాణమే ప్రమాదానికి కారణం
సుమారు 10 అడుగుల ఎత్తు ఉండే ఈ రిటైనింగ్ వాల్ (గోడ) నిర్మాణాన్ని 10 రోజుల కిందట మొదలుపెట్టి మూడు రోజుల క్రితమే పూర్తిచేసినట్టు తెలుస్తోంది. ఈ హడావిడి నిర్మాణమే ప్రమాదానికి కారణమని, దీంతో పాటు, డిజైనింగ్ లోపమూ ఉన్నట్టు చెబుతున్నారు. అవినీతి ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
సీపీఐ(ఎం) సంతాపం
విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడకూలి మృతిచెందిన వారికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చనిపోయిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుండటం మరింత ఆవేదన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, గాయపడిన స్థితిని బట్టి రూ.10 లక్షల వరకూ నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రమాదానికి కారణమైన గోడ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరు, పర్యవేక్షించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.