నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క దాడిలోనే యజమాని ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్న సంఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, మధురానగర్‌లో నివసించే పవన్ కుమార్ (ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడి స్నేహితుడు సందీప్, పవన్‌ను కలిసేందుకు అతడి ఇంటికి వెళ్లాడు. తలుపులు మూసి ఉండటంతో ఎంత పిలిచినా, తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సందీప్, బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ కుమార్‌ను చూసి షాక్‌కు గురయ్యాడు. గదిలోనే ఉన్న పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉండటాన్ని సందీప్ గమనించాడు. పవన్ కుమార్ శరీరంపై గాయాలు ఉండటం, కుక్క నోటికి రక్తం ఉండటంతో.. ఆ కుక్కే పవన్‌పై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి చంపి ఉంటుందని సందీప్ అనుమానం వ్యక్తం చేశాడు. కొన్ని శరీర భాగాలను కుక్క తినివేసినట్లు తెలుస్తోంది. వెంటనే సందీప్ మధురానగర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు, సందీప్ కథనం ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పవన్ చనిపోయే సమయంలో ఇంట్లో ఆ పెంపుడు కుక్క తప్ప మరెవరూ లేరని స్నేహితుడు సందీప్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పవన్ మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం.. పెంపుడు కుక్క దాడిలో యజమాని మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES