నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబం అంతా ఆనందంతో పూలతో బతుకమ్మ పేర్చుకుని, గ్రామ దేవాలయం వద్ద ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవానికి వెళ్లి పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ, ఇతర మహిళలతో కలిసి చుట్టూ తిరుగుతున్న శెట్టి పల్లవి (మౌనిక) (36) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతలో ఆవరణంతా అయోమయమే. ఆనందంగా ఉన్న మహిళలు ఒక్కసారిగా కలత చెంది పరుగులు తీశారు.
స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యంలోనే మౌనిక చివరి శ్వాస విడిచింది. బతుకమ్మ కోసం ఉదయం నుంచే భర్త కూతుళ్లు, కుమారునితో కలిసి పూలు తెంపి సాయంత్రం సంతోషంగా బతుకమ్మ పట్టుకొని దేవాలయానికి వెళ్ళి పండుగ ఉత్సాహంలో పాటలు పాడుతూ ఆడిన తల్లి కొద్దిసేపటికే శవంగా మారిపోవడం గ్రామాన్ని కన్నీటితో ముంచెత్తింది. ఆ ముగ్గురు చిన్నారులు అమ్మా.. లే.. అమ్మా.. అంటూ రోదనలతో హృదయాలు ముక్కలయ్యాయి. దీంతో గ్రామమంతా విషాదంగా మారింది.