నవతెలంగాణ-హైదరాబాద్: నంద్యాల జిల్లా బనగామపల్లెలో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి మధుప్రియ మృతిచెందింది. శుక్రవారం ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై.. ఒక్కసారిగా కుక్కలు ఎటాక్ చేశాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల కాలంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ.. వచ్చిపోయేవారిపై దాడి చేస్తూ గజగజా వణికిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో ఒక్కరోజే.. మొత్తం 29 మందిపై దాడి చేసి.. రక్తం కళ్లచూశాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఒకే కుక్క ఏకంగా 14 మందిపై దాడి చేయడం కలకలం రేపింది. ఆ వెంటనే ఆదిలాబాద్‌లోని బాసరలో పలు వీధి కుక్కలు మొత్తం 15 మందిపై దాడి చేశాయి. దీంతో వీధి కుక్కలను నివారించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.