Sunday, May 11, 2025
Homeచైల్డ్ హుడ్పరివర్తన..

పరివర్తన..

- Advertisement -

ఇంద్రావతి గ్రామంలో గోవిందయ్య అనే ఒక కిరాణ వ్యాపారి వుండేవాడు. ఆ ఊళ్ళో అతనిది ఒకటే కిరాణా కొట్టు. అంచేత ఎక్కువ ధరలకు వస్తువులను అమ్ముతూ, తూకాలలో మోసాలు చేసేవాడు. అతని మోసాలను ప్రశ్నించే వారే లేరు.
గోవిందయ్య కుమారుడు సురేష్‌, ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తెలివైనవాడు, సున్నిత మనస్కుడు. ధర్మంగా, న్యాయంగా వుండాలని కొడుకుకు నీతి మాటలు చెప్పేవాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్టు సురేష్‌ చదువులో బాగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడ
అదే ఊళ్ళో వడ్రంగి ఓబయ్య కుమారుడు తుకారం, సురేష్‌ స్నేహితుడు. ఒక రోజు పిల్లలందరూ కలసి బడి నుండి ఇళ్లకు తిరిగి వస్తుండగా, ”సురేష్‌, నిన్ను ఒక మాట అడగాలి ఏమనుకోవు కదా” అన్నాడు తుకారం. అదేంటో చెప్పమన్నాడు సురేష్‌.
”తప్పుడు తూకాలతో మీ నాన్న మోసగిస్తున్నాడని, మా అమ్మతో మా నాన్న చెప్పగా విన్నాను. ఊళ్ళో కూడా ఇదే మాట అనుకుంటూ, మీ నాన్నను తిడుతున్నారట. అలా దూషించటం, నాకు బాధగా వుంది. నీవైనా, కాస్తా ఆయనకు చెప్పిచూడు సురేష్‌” అన్నాడు తుకారాం.
”నాన్న మోసం చేస్తాడని నేను అనుకోను తుకారం! నన్ను బుద్ధిగా పెంచుతున్న అతడు, ఇలా చేస్తున్నట్లు నీ ద్వారానే నాకు తెలిసింది” బదులిచ్చాడు సురేష్‌.
”నేనూ కూడా నమ్మలేదు. అందుకే నిన్ను అడిగాను. కానీ దోస్తికి నీవు దూరం అవుతావని భయపడ్డాను” అన్నాడు తుకారాం.
”అలా అనుకోకు తుకారాం. అపార్థాలు మన మధ్య వుండవు! నీవు చెప్పిన విషయం మా నాన్నను అడుగుతాను” అన్నాడు సురేష్‌.
”ఏమీ అనుకోకు. నేను చెప్పినట్లు, ఎవరికీ చెప్పకు. మన పెద్దవాళ్ళ మధ్య మనస్పర్థలు వస్తాయి” అన్నాడు తుకారం.
”అలాగే. కానీ మా నాన్న అలా ఎందుకు మారిపోయాడో అడిగి తెలుసుకోవాలి. నీకేమీ అవదులే” అన్నాడు సురేష్‌
ఆ రోజు తన ప్రోగ్రెస్‌ కార్డు అందుకున్న సురేష్‌, మొదటి ర్యాంకు వచ్చిందని తెలిసి, సంతోషాన్ని అమ్మా నాన్నలతో పంచుకోవాలని అనుకున్నాడు. అంతలో తుకారం మాటలు గుర్తుకు వచ్చాయి.
ముభావంగానే, ప్రోగ్రెస్‌ కార్డును తండ్రికి చూపిస్తూ సంతకం పెట్టి ఇవ్వమన్నాడు. రిపోర్ట్‌ చూసిన గోవిందయ్య పొంగిపోతూ కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. అబ్బాయి మౌనాన్ని అర్థం చేసుకుని చలాకీగా వుండేవాడు దిగులుగా ఉన్నాడని గ్రహించి ”ఒంట్లో బాగోలేదా” అని ప్రశ్నించాడు.
సమాధానం లేనందున, మరోమారు కొడుకును అడిగాడు గోవిందయ్య. లాభం లేక పోయింది. అబ్బాయిని దగ్గరకు తీసుకుని తల్లి యశోదమ్మ అడగగా, ”నాన్నను గురించి మన ఊళ్ళో వాళ్లకు మంచి అభిప్రాయం లేదమ్మా. కొట్టుకు వచ్చిన వాళ్లకు తప్పుడు తూకాలతో మోసం చేస్తున్నాడని తెలిసి కొంచెం బాధేసింది” అన్నాడు సురేష్‌
ఆ విషయాలు వదిలేసి చదువు మీద శ్రద్ద పెట్టమన్నాడు గోవిందయ్య.
”అమ్మా , నీవైనా చెప్పు నాన్న చేస్తున్నది న్యాయమేనా? నాకేమో ఎన్నో నీతులు వల్లిస్తూ వుంటాడు. మరి తాను చేస్తున్నది ఏంటీ?” ప్రశ్నించాడు సురేష్‌.
సురేష్‌ మాటలకు ఆలోచనలో పడ్డది యశోదమ్మ. పెద్దల ప్రవర్తన పిల్లలపై ప్రభావితం చూపుతుంది. సురేష్‌ అన్నట్లు తన భర్త తప్పు చేస్తున్నాడని భావించిన ఆమె, ”వాడు చెబుతున్నది నిజమేకదా! మీరు చేస్తున్నది తప్పని మీ అంతరాత్మకు తెలియదా? పెద్ద వాళ్ళను చూసే కదా పిల్లలు నేర్చుకునేది. వాళ్ళు సన్మార్గంలో పెరగాలంటే , పెద్దలు కూడా తాము చెప్పేది ఆచరణలో పెట్టాలి. ఇకనైనా మీరు నిజాయితీగా మెలగండి” అంది యశోదమ్మ. భార్య చెప్పిన మాటలను మౌనంగా వింటూ, చిన్నవాడైనా నా కళ్ళు తెరిపించాడని తన తప్పును తెలుసుకున్నాడు గోవిందయ్య.

  • కరణం హనుమంతరావు, 6300043818

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -