నవతెలంగాణ-హైదరాబాద్: మెట్రో రైళ్లలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా ప్రభుత్వం నియమించింది. మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతి, వారు ఆత్మగౌరంతో జీవించాలన్నదే సీఎం సంకల్పమన్నారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్లు.. ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి. ట్రాన్స్‌జెండర్‌లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారు’’ అని మంత్రి పేర్కొన్నారు.