నవతెలంగాణ – అశ్వారావుపేట
నాడైనా నేడు అయినా కాంగ్రెస్ హయాంలో నే గిరిజనాభివృద్ది వేగిరం అయిందని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. బుధవారం అశ్వారావుపేట మండలం కొండతోగు లో ఐటీడీఏ పీఓ రాహుల్ తో కలిసి ఆయన తాత్కాలికంగా నూతన జీపీఎస్ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొండతోగు గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఈ గ్రామంలోని చిన్నారులు అడవి మార్గాన వాగు దాటి ఎంపీపీ పాఠశాలలో చదువుతున్నారని నా దృష్టికి రావడంతో ఐటీడీఏ పీవో ను సంప్రదించడం జరిగిందని, కొత్త బిల్డింగ్ కట్టే వరకు ప్రస్తుతం ఈ పాఠశాలను అంగన్వాడీ సెంటర్లో ఏర్పాటు చేశామని పిల్లల యొక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలను ఈ పాఠశాలలకు పంపి బాగా చదివించుకుని వృద్ధిలోకి తెచ్చుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
అనంతరం ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ .. గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులు నిష్ణాతులు అయ్యేలా గిరిజన సంక్షేమ ద్వారా అనేక రకాలైన సంస్కరణలు చేపట్టి గిరిజన విద్యార్థులను వారు అనుకున్నది సాధించే వరకు అహర్నిశలు పాటు పడేలా తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.
గిరిజనులు,పేదలు, ధనవంతులు,మధ్యతరగతి ఎవరైనా మంచిగా చదువు కుంటే నే ఖచ్చితమైన ఉన్నత స్థానాన్ని పొందుతారని,చదువుకున్న విలువ అదని, గిరిజనుల పిల్లలను గుర్తించాం కాబట్టి ఐటీడీఏ తరఫున విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,పాఠశాల ఉండీ భవనాలు లేని చోట భవనాలు నిర్మిస్తున్నామని,స్కూల్స్ ఉన్నచోట టీచర్లు తక్కువ ఉండి పిల్లలు ఎక్కువగా ఉంటే టీచర్లను సర్దుబాటు చేస్తున్నామని,పాఠశాలలకు వచ్చే గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా అర్థం చేసుకొని చదువుకోవాలని, పాఠాలను బట్టి పట్టి చదువుకునే పద్ధతిని మానుకోవాలని,గిరిజన పిల్లలు నేర్చుకునేది అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలకు ఉద్దీపణం,పెద్దవారికి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న అన్ని పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
కొండతోగులో దాదాపు 25 మంది గిరిజన పిల్లలు దూరం వెళ్ళి చదవాల్సి రావడం,ఆ పాఠశాల చాలా దూరంగా అడవి మార్గాన నడిచి వెళ్లి వాగు దాటాల్సిన పరిస్థితి ఉందని,వర్షాకాలంలో ఆ వాగు పొంగడం వలన పిల్లలకు ఏదైనా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని గ్రామస్తులు తెలపడంతో,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ లు తనకు చరవాణి ద్వారా తెలపడంతో కొండతోగు గ్రామములో 23 మంది పిల్లలు ఉన్నందున వారికి విద్య వారి ఊరిలోనే ఇవ్వాలనే ఉద్దేశంతో తాత్కాలికంగా అంగన్వాడీ బిల్డింగులు ప్రారంభిస్తున్నామని,దానికి ఏమైనా చిన్న చిన్న మరమత్తులు ఉంటే త్వరితగతిన చేయిస్తామని అన్నారు.
అనంతరం విద్యార్థులకు ఉద్దీపణం వర్క్ బుక్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏ సి ఎం ఓ రమేష్,ఏ టి డి ఓ చంద్రమోహన్ మరియు గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.