నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ పంచాయతీ కార్యాలయంలో గురువారం జాతీయ అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన కమ్మర్ పల్లి 108 అంబులెన్స్ వాహనం అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు సుంకరి విజయ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామి చేతుల మీదుగా ఈఎంటి విజయ్ కుమార్ ను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ 108 అంబులెన్స్ సేవల్లో అత్యవసర సమయంలో కీలకంగా వైద్య సేవలు అందించేది ఈఎంటిలు, ప్రమాదం ఏదైనా విధి నిర్వహణలో 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తూ ప్రాణ దాతలుగా నిలుస్తున్నారన్నారు.
రోడ్డు ప్రమాదం, గుండె పోటు, పాము కాటు, ప్రసవ సమయంలో అత్యవసర వైద్య పరిస్థితి ఏదైనా వారు రోగులను తరలిస్తూ ప్రాథమిక చికిత్సను వాహనంలోనే అందిస్తూ ఆసుపత్రికి సకాలంలో చేరుస్తూ ఎంతో మంది ప్రాణాలను కపడుతున్నారన్నారు. గ్రామానికి చెందిన సుంకరి విజయ్ కొన్ని సంవత్సరాలుగా 108 ఈఎంటిి గా సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.రానున్న రోజుల్లో అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండి మరెన్నో ప్రాణాలు కాపాడాలని ఆకాంక్షిస్తూ వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పవన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హసీనా, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, వైద్యాధికారులు మహేందర్, ఏఈఓ రమేష్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వార్డ్ సభ్యులు అజయ్, సంతోష్, రాకేష్, సురేష్, అనిల్, గ్రామ నాయకులు సోమా దశరథ్, ఆంజనేయులు, ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.



