Sunday, May 11, 2025
Homeఎడిట్ పేజిఉగ్ర 'ట్రోల్స్‌'

ఉగ్ర ‘ట్రోల్స్‌’

- Advertisement -

ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడిలో మనవారు ఇరవై ఆరుమంది చనిపోవడం పట్ల దేశమంతా ఓవైపు భావోద్వేగంతో రగిలిపోతున్నది. ఉగ్రవాదుల స్థావరాలపై భారత్‌ క్షిపణులు, రాకెట్లతో దాడులు చేస్తుండటం వార్తల్లో చూస్తున్నాం. మరోవైపు ఏ ఆయుధం లేకుండా మనిషిని చిత్రవధ చేసి చంపే ఉన్మాదం తలకెక్కిన ముష్కరులు బాధిత కుటుంబాల్ని ‘ట్రోల్‌’తో దాడులు చేయడం బాధాకరం. కాశ్మీర్‌లో ఉగ్ర తూటాలకు బలైన నెవీ లెఫ్టినెంట్‌ విజరునర్వాల్‌ మృతదేహం పక్కన అచేతనంగా కూర్చుని విలపిస్తున్న హిమాన్షు ఫొటో ప్రపంచమంతా వైరల్‌ అయింది. అలాగే తండ్రిని కోల్పోయిన కేరళకు చెందిన ఆరతి మీనన్‌ తన పిల్లల్ని కాపాడుకున్న తీరు మానవత్వం ఉన్న ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. కానీ ఈరోజు హిమాన్షు, ఆరతిలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున వ్యక్తిత్వ హననం జరుగుతున్నది. దేశమత సామరస్యాన్ని దెబ్బతీసే ఈ చర్య సహించకూడనిది.
పహల్గాం ఘటన తర్వాత మీడియా హిమాన్షు, ఆరతులను పలకరిస్తే ఆప్తులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండి కూడా ఎంతో సహనాన్ని ప్రదర్శించారు. హిమాన్షు అయితే ‘ఉగ్రవాదం అంతం కావాలి. ఇప్పుడు మనకు శాంతి కావాలి. చంపింది ముస్లింలే కావచ్చు, ఈ ఘటనకు కాశ్మీరీలను, ముస్లింలను బాధ్యుల్ని చేయట్లేదు. కానీ, ఈదాడికి పాల్పడిన దుండగులను శిక్షించాలి’ అన్నారు. అలాగే ఆరతి ‘ఈ ఉగ్రదాడిలో నేను నాన్నను కోల్పోయాను. కానీ ఇద్దరు సోదరులను పొందాను. చంపింది ముస్లింలే కానీ, ఇంటికి క్షేమంగా చేరుకోవడానికి సహాయం చేసింది కూడా వారే. చంపినవారి మతాన్ని బట్టి వ్యవహరించొద్దు’ అని చెప్పారు. వీరు మన దేశగౌరవాన్ని పెంచడమే కాదు, శాంతి సామరస్యాన్ని హిమాలయ పర్వతాల్లాంటి ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇది మతపరంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టే మూకలకు అస్సలు నచ్చలేదు. హిమాన్షు, ఆరతిలపై సోషల్‌ మీడియాలో నీచ, అతి నీచమైన పోస్టులు పెట్టి సభ్యసమాజం సిగ్గుపడే విధంగా కొందరు వ్యవహరించారు. హిమాన్షుపై చేసిన ఒక క్రూరమైన పోస్టు ఏమిటంటే? ‘ నిన్ను కూడా చంపితే అప్పుడు సపోర్టు చేసేది తురకలకి’ అని. అంతేకాదు, ‘ఒక షూటర్‌ను ఏర్పాటు చేసి తన భర్తను తానే చంపించింది కావచ్చు. ముందు ఆమెపై దర్యాప్తు జరపాలని’. వీటిపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ట్రోల్స్‌ ఆగలేదు.
దేశంలో కొంతమంది ఉన్మాదాన్ని తలకెక్కించుకుని వ్యవహరిస్తున్న తీరు శాంతిని కొల్లగొట్టే విధంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఏడడుగులతో ఏకమై, నీవే సర్వస్వమని చెప్పి, సంతోషంగా గడిపేందుకు హనీమున్‌కు తీసుకొచ్చిన భర్త తన కండ్లముందే విగతజీవిగా మారడం ఎవరికైనా షాకే. ఉగ్రవాదులు వారి ఆత్మీయుల్ని బలిగొంటే, ఈ సోషల్‌ మీడియా ఉన్మాదులు వారి వ్యక్తిత్వానికి భంగం వాటిల్లే విధంగా, మనోధైర్యం కోల్పోయేలా పోస్టులు ట్రోల్‌ చేస్తున్నారు. ఉగ్రవాదుల ఆయుధాల నుంచి వచ్చిన తూటాలు శరీరాన్ని ఛిద్రం చేస్తే, వారి చర్యల్ని ప్రోత్సహించే విధంగా పెట్టే ఈ పోస్టులు మనసును ధ్వంసం చేస్తున్నాయి. బయటకు వేర్వేరుగా కనిపించే ఈ ఉగ్రరూపాలు నిజంగా వేరు కాదు. వారి లక్ష్యం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, మత ఘర్షణలు పెట్టడం, ప్రజల ఐక్యతను చీల్చడం.
దేశ శ్రేయస్సు కోరుకోవడం హిమాన్షు చేసిన తప్పా? బుర్రనిండా విద్వేషం నింపుకున్న వారికి ఆమె శాంతి సందేశం చెవికెక్కు తుందా? దేశంలో యుద్ధం జరిగి ముస్లింలను, కాశ్మీరీలను చంపేయండి అని ఆమె కోరుకుంటే అప్పుడు వీరికి సంతోషమా! హింసను కోరుకోవడం లేదు కాబట్టి పెన్షన్‌ కూడా ఇవ్వద్దని మరో పోస్టు. ఆమె జెఎన్‌యూలో చదువుకోవం వల్లే ఇలా మాట్లాడుతుందని కొందరు, అక్కడున్నప్పుడే ముస్లింలను ప్రేమించిందని మరికొందరు, కశ్మీరులు ఎక్కువగా ఉండే జెహ్లాం హాస్టల్‌కు తను తరచూ వేళ్లేదని, లేట్‌నైట్స్‌ గడిపేదని నోటికొచ్చినట్టు ట్రోల్‌ చేస్తున్నారు. ఆమె క్యారెక్టర్‌పై ఇష్టారీతిగా రాసేస్తున్నారు. హిందూత్వ నైట్‌ అనే అకౌంట్‌ నుంచి వచ్చిన ఒక పోస్టు చూస్తే ‘వేలాది మంది శత్రువులైనా దొరుకుతారు కానీ, హిమాన్షు లాంటి అందమైన భార్య దొరకదు’ అని, ‘ఆమె భర్తను చంపినవారిని ద్వేషించాల్సింది పోయి వారిని ప్రేమించడం ఏంటని?’ ఇలా బాధితుల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి విద్వేషాన్ని నింపుతున్నారు. అందుకే రాజ్యసభ్య సభ్యుడు సాకేత్‌ గోఖలే కేంద్రానికి ఓ ప్రశ్న సంధించారు. ‘పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నేవీ ఆఫీసర్‌ వినరు సతీమణిపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ రావడం దారుణం. ఆ మీడియా అకౌంట్లలో బీజేపీకి సంబంధించిన వ్యక్తులవే ఎక్కువగా ఉన్నాయి. ఆయా అకౌంట్లను ఎందుకు బ్లాక్‌ చేయడం లేదో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాధానం చెప్పాలి. ఒక ఆర్మీ ఆఫీసర్‌ భార్యను ట్రోల్‌చేసి కూడా వారు చట్టం నుంచి తప్పించుకుంటున్నారు. ఇదేనా జాతీయవాదం’ అన్నారు. దీనికి జవాబు చెప్పాల్సింది కేంద్రమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -