న్యూఢిల్లీ : విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సుల (సీడీఎల్) జారీని అమెరికా నిషేధించడంతో మన దేశంలో వేలాది యువకుల ఆశలు, ఆకాంక్షలకు విఘాతం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోని ట్రక్ డ్రైవర్లకు అమెరికా నిషేధం శరాఘాతమే. ఎందుకంటే అమెరికాలో ట్రక్కులు నడుపుతూ ఆదాయాన్ని పెంచుకోవాలని, గౌరవాన్ని పొందాలని వారు భావిస్తారు. అమెరికా ట్రక్ పరిశ్రమ ఎంతోమంది విదేశీయులను ఆకర్షిస్తోంది. అక్కడ జీతాలు ఎక్కువగా ఉంటాయి. జీవన శైలి సురక్షితంగా ఉంటుంది. ఓపెన్ రోడ్డుపై ప్రయాణంలో వారికి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ కారణాలతో అమెరికా ట్రక్ పరిశ్రమ విదేశీయులను…ముఖ్యంగా భారతీయులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. అక్కడ మెరుగైన జీవితం గడపగలమని అనేక మంది కలలు కంటుంటారు.
అయితే ఇప్పుడు ఆ కలలన్నీ కల్లలయ్యాయి. విదేశీ డ్రైవర్లకు వర్క్ వీసాలు, సీడీఎల్‌లు జారీ చేయడంపై ట్రంప్ ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించింది. ఈ నిర్ణయం భారతీయ డ్రైవర్ల పైన, వలస వెళతామని అనుకుంటున్న వారి పైన ప్రభావం చూపబోతోంది. అమెరికాలో ట్రక్ డ్రైవర్లకు మైలుకు సగటున 0.60-0.70 డాలర్లు ఇస్తారు. రోజుకు ఐదారువందల మైళ్ల ప్రయాణం ఉంటుంది. అంటే ఒక ట్రక్కు డ్రైవరు సగటున నెలకు రూ.4.2 లక్షల నుంచి రూ.6.7 లక్షలు సంపాదిస్తాడు. కొందరు యజమానులు గంటకు రూ.1,680-రూ.2,520 చెల్లిస్తారు. ఇది అనుభవం, ప్రదేశం, యజమానిపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా సగటున ఏడాదికి రూ.40 లక్షల జీతం లభిస్తుంది. వాల్‌మార్ట్, అమెజాన్ వంటి కంపెనీలైతే సీజనల్ డ్రైవర్లకు రూ.92 లక్షల వరకూ ఇస్తున్నాయి.
పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ట్రక్కు డ్రైవర్లు…ముఖ్యంగా సిక్కులు అమెరికాలో అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. చట్టబద్ధంగా పనిచేస్తున్న వారిని తక్షణం కలిగే ముప్పు ఏమీ లేనప్పటికీ వీసాల రెన్యువల్ కష్టమవుతుంది. నిషేధం కొనసాగిన పక్షంలో వేలాది మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు ఉద్యోగాలనో లేదా భవిష్యత్ అవకాశాలనో కోల్పోతారు.
అమెరికా ఆంక్షలతో అడియాసలైన ట్రక్ డ్రైవర్ల ఆశలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES