నవతెలంగాణ – హైదరాబాద్: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో-చైనా సరిహద్దుల్లో కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు అంజావ్ జిల్లాలో అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో అనేక మంది మరణించారు. అంజావ్ డిప్యూటీ కమిషనర్ మిల్లో కోజిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండో-చైనా సరిహద్దు వెంబడి ఉన్న హయూలియాంగ్–చగ్లగామ్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
అసోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన దినసరి కూలీలను తీసుకువెళ్తున్న ట్రక్కు మార్గం మధ్యలో అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 22 మంది కూలీలు ఉన్నారు. వారంతా చనిపోయినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.



