నవతెలంగాణ హైదరాబాద్: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి.. క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందువల్లే ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ సైనిక చర్య చేపట్టామని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామన్నారు. ఆ దేశ నాయకులు ఇప్పటికైనా తమ మాట వినకపోతే మొత్తం దేశాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు.
ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారని ట్రంప్ అన్నారు. ఇటీవల నిరసనలు చేపట్టిన తన సొంత పౌరులనే అక్కడి ప్రభుత్వం వీధుల్లో దారుణంగా చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండడం ప్రమాదకరమని.. అందువల్లే వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఇకనైనా అణ్వాయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని.. లేదంటే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.



