Saturday, June 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఎప్‌స్టైన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌

ఎప్‌స్టైన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌

- Advertisement -

– బాంబు పేల్చిన మస్క్‌
– టెస్లా అధినేత ఆరోపణతో అమెరికాలో రాజకీయ తుపాన్‌
న్యూఢిల్లీ:
అగ్రరాజ్యం అమెరికాను రాజకీయ తుపాను ముంచెత్తుతోంది. టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ మరో బాంబు పేల్చారు. చాలా కాలంగా రహస్యంగా ఉన్న ఎప్‌స్టైన్‌ ఫైల్స్‌లో దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఉన్నదని ప్రకటించారు. దీంతో ఈ ఫైల్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఎప్‌స్టైన్‌్‌కు, అమెరికాలోని శక్తివంతులైన రాజకీయ నేతలకు మధ్య ఉన్న సంబంధాల చుట్టూ నెలకొన్న వివాదానికి మస్క్‌ చేసిన ప్రకటనతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ట్రంప్‌ పేరు ఉండడం వల్లనే సీలు వేసిన ఆ ఫైల్స్‌ను విడుదల చేయడం లేదని మస్క్‌ ఆరోపించారు. ‘నేను ఓ పెద్ద బాంబును పేలుస్తున్నాను. ఎప్‌స్టైన్‌ ఫైల్స్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఉంది. అందుకే వాటిని బయటపెట్టడం లేదు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మస్క్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ తర్వాత మరో పోస్ట్‌ పెడుతూ ‘భవిష్యత్తు కోసం ఈ పోస్టును భద్రపరచుకోండి. నిజం బయటపడుతుంది’ అని అన్నారు. ట్రంప్‌, మస్క్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ట్రంప్‌ ఆర్థిక బిల్లుపై మస్క్‌ మండిపడుతూ అది ఓ అసహ్యకరమైన బిల్లు అని వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్‌ ఘాటుగానే స్పందించారు. ‘ట్రంప్‌ డిరేంజ్‌మెంట్‌ సిండ్రోమ్‌’తో మస్క్‌ బాధపడుతు న్నారని ఎత్తిపొడిచారు. ఆ తర్వాత కొద్ది గంటలకే మస్క్‌ నుంచి ఈ పోస్ట్‌ వెలువడింది.
ఎవరీ ఎప్‌స్టైన్‌?
అసలు ఎవరి ఎప్‌స్టైన్‌? ఆయన లైంగిక నేరస్తుడిగా నిర్ధారణ అయిన ఫైనాన్షియర్‌. ఎప్‌స్టైన్‌, అతని సహచరులపై అనేక క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఫైళ్లు గతంలో విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరికొన్ని ఫైళ్లను న్యాయ శాఖ విడుదల చేసింది. కాగా ట్రంప్‌, ఎప్‌స్టైన్‌ మధ్య 1990వ దశకం నుంచి స్నేహం ఉంది. మార్‌-ఏ-లాగో ఎస్టేట్‌లో ట్రంప్‌ ‘క్యాలెండర్‌ గర్ల్‌’ పోటీని నిర్వహించినట్టు చూపించే 1992 నాటి క్లిప్‌ను మస్క్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. ట్రంప్‌ అనేక పర్యాయాలు ఎప్‌స్టైన్‌ ప్రయివేటు జెట్లలో ప్రయాణించారు. ముఖ్యంగా ఫ్లోరిడా, న్యూయార్క్‌ మధ్య ఆయన ప్రయాణించారు. ఎప్‌స్టైన్‌ వారసురాలు గిస్‌లైన్‌ మాక్స్‌వెల్‌కు సంబంధించిన కేసులో విడుదలైన పత్రాల ప్రకారం… యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఎప్‌స్టైన్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ట్రంప్‌ ప్రయివేటు గోల్ఫ్‌ క్లబ్బులో ట్రంప్‌, ఎప్‌స్టీన్‌ చాలాసార్లు ఫొటోలు దిగారు. తనకు ఎప్‌స్టీన్‌ పదిహేను సంవత్సరాలుగా తెలుసునని, ఆయన ఓ అద్భుత వ్యక్తి అని 2002లో న్యూయార్క్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ కితాబు ఇచ్చారు. ‘అతను నా లాగే అందమైన మహిళలను ఇష్టపడతాడని చెబుతారు. వారిలో చాలా మంది చిన్నవారే’ అని కూడా చెప్పారు.
జైలులోనే ఆత్మహత్య
2019లో ఎప్‌స్టైన్‌ మరోసారి అరెస్ట్‌ కావడంతో ట్రంప్‌ ఆయన నుంచి దూరం జరిగారు. ఫ్లోరిడా రియల్‌ ఎస్టేట్‌ విషయంలో విభేదాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎప్‌స్టైన్‌ బాగా డబ్బున్న వారితోనూ, రాజకీయ నాయకులతోనూ సంబంధాలు పెంచుకున్నారు. 2005లో ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో 14 సంవత్సరాల బాలికకు లైంగిక సంబంధం కోసం డబ్బు చెల్లించాడన్న ఆరోపణ లపై ఆయనను మొదటిసారి అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత డజన్ల కొద్దీ బాలికలు ఇలాంటి లైంగిక ఆరోపణలే చేశారు. 2008లో వ్యభిచారం కోసం ఓ పిల్లవాడిని నియమించుకున్న విషయాన్ని అంగీకరించి 13 నెలల జైలుశిక్ష అనుభవించారు. తీవ్రమైన ఫెడరల్‌ నేరాలపై ఆయనను 2019లో మరోసారి అరెస్ట్‌ చేసినప్పుడు జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్‌స్టైన్‌ వ్యవహారంలో అనేక మంది ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే కోర్టు ఆదేశాల కారణంగా కొందరి పేర్లు నేటికీ వెలుగు చూడలేదు. ఎప్‌స్టైన్‌ కేసుకు సంబంధించిన కీలక పైళ్లను ప్రభుత్వం దాచిపెడుతోందన్న
ఆరోపణలు ఉన్నాయి. పత్రాలను విడుదల చేయాలని మాజీ అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ ఫిబ్రవరిలో న్యాయ శాఖను కోరడంతో వివాదం మళ్లీ రాజుకుంది. న్యాయ శాఖ కొన్ని ఫైళ్లను విడుదల చేసినప్పటికీ అవి అప్పటికే కోర్టు కేసులు, ప్రభుత్వ రికార్డులు, వ్యాజ్యాలు, సమాచార చట్టం కింద అభ్యర్థనల ద్వారా వెలుగు చూసినవే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -