మధ్యప్రాచ్యయుద్ధంలో బయటపడటం అంత ఈజీ కాదు
వాషింగ్టన్ : మధ్యప్రాచ్య యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఎందుకంటే యుద్ధాన్ని మొదలు పెట్టారే కానీ దానిని ఎలా ముగించాలో ఆయనకు అర్థం కాని పరిస్థితి. సుప్రీం నేత అలీ ఖమేనీని, సీని యర్ నేతలను తొలి రోజునే హతమార్చినప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చలేక పోయారు. ఇప్పుడు హార్మూజ్ జలసంధి ఆయనకు ఓ పెద్ద గుదిబండలా మారింది. దానిలో చమురు నౌకల రవాణాను ఇరాన్ నిషే ధించడంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవు తున్నాయి. దీనికంతటికీ ట్రంపే కారకుడంటూ ఆయనను పలువురు నిందిస్తున్నారు. ఒకవైపు చౌకగా లభిస్తున్న డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకు పడుతుంటే ఏం చేయాలో అర్థం కాని అయో మయంలో ట్రంప్ మహాశయుడు కొట్టు మిట్టాడుతున్నారు. బేషరతుగా లొంగిపోవాలంటూ ట్రంప్ చేసిన హెచ్చరికను ఇరాన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇరాన్ యుద్ధం దాదాపుగా ముగింపు దశకు చేరు కున్నదంటూ ఆయన గొప్పలు చెప్పుకుం టున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థి తులు అలా లేవు. యుద్ధాన్ని ప్రారంభించే ముందు ట్రంప్ వేసు కున్న అంచనాలన్నీ తప్పాయి. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను పదవీచ్యుతుడిని చేయ డం ద్వారా అక్కడి చమురు నిల్వలను తన అధీనంలోకి తీసుకు న్నానని, అలాగే ఇరాన్‌లో కూడా చేయవచ్చునని ఆయన ఆశించారు. కానీ అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హర్మూజ్‌ను మూసి వేయడం ద్వారా అమెరికాను ఇరాన్ చావుదెబ్బ కొట్టింది. ప్రపంచ దేశాల ముందు అగ్రరాజ్యాన్ని, దాని అధి నేతను దోషిగా నిలబెట్టింది. ఇరాన్ ప్రజలను ఇస్లా మిక్ పాలకులకు వ్యతి రేకంగా రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని భావించిన ట్రంప్‌కు ఆ విషయంలోనూ చేదు అనుభవమే ఎదురైంది. అలీ ఖమేనీకి ఇరాన్‌లో ఉన్న వ్యతిరేకత ఆయన మరణంతో పూర్తిగా తుడిచి పెట్టుకొని పోయింది. వారసుడిగా వచ్చిన మొజ్తా బాకు ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించారు. చౌకైన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కోవడానికి అమెరికా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖరీదైన పాట్రియట్, థాడ్ వ్యవస్థలను ఉపయోగించు కుంటుండడంతో అమెరికా ఖజానా ఖాళీ అవుతోంది. యుద్ధం ప్రారంభిం చడానికి ముందు ట్రంప్ ప్రజాభిప్రాయాన్ని కోరలేదు. అనూ హ్యంగా దాడులను ప్రకటించారు. ఈ వ్యూహం బెడిసికొట్టింది. మెజారిటీ అమెరికన్లు ఇరాన్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ప్రతినిధి సభకు నవంబరులో జరగబోయే మధ్యంతర ఎన్నికలు ట్రంప్‌కు సవాలుగా మార బోతున్నాయి.
రిపబ్లికన్ల పాలనలో ఉన్న అనేక రాష్ట్రాలు చేజారే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య యుద్ధానికి ఏదో విధంగా ముగింపు పలికేందుకు ట్రంప్ సిద్ధపడుతున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వైమానిక దాడులు సత్ఫలితాలను ఇవ్వకపోవడతో భూతల దాడులు మొదలు పెట్టాలని ఆయన తొలుత అనుకున్నప్పటికీ సలహాదారులు మాత్రం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. భూతల దాడులతో మరింత నష్టపోతామని వారు ఆయనను హెచ్చరించారు.



