Wednesday, May 21, 2025
Homeఎడిట్ పేజిపుతిన్‌తో ఫోన్‌ తర్వాత చేతులెత్తేసిన ట్రంప్‌, మధ్యవర్తిగా పోప్‌?

పుతిన్‌తో ఫోన్‌ తర్వాత చేతులెత్తేసిన ట్రంప్‌, మధ్యవర్తిగా పోప్‌?

- Advertisement -

తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ పోరు నిలిపివేస్తానన్నాడు డోనాల్డ్‌ ట్రంప్‌. పుతిన్‌తో భేటీ తరువాతే అది జరుగుతుందని కొద్ది రోజుల క్రితం చెప్పాడు. సోమవారం నాడు రెండు గంటలకు పైగా ఫోన్‌ సంభాషణ చేశాడు.చర్చలు అద్భుతంగా జరిగాయని ట్రంప్‌ వర్ణిస్తే అంతసీన్‌ లేదన్నట్లుగా పుతిన్‌ స్పందన ఉంది. పోప్‌ సాయంతో రెండు దేశాలూ సంప్రదించుకోవటం ద్వారా మాత్రమే శాంతి ఒప్పందం కుదురుతుందని, తక్షణమే చర్చలు ప్రారంభమౌ తాయని ట్రంప్‌ ప్రకటించాడు.అమెరికా నుంచి ఎన్నికైన పోప్‌ 14వ లియో మధ్యవర్తిత్వం గురించి కొద్ది రోజల క్రితం వచ్చిన ఊహాగానాలను ట్రంప్‌ ఒక విధంగా నిర్దారించినట్లే. దీన్ని బట్టి శాంతి చర్చల కేంద్రంగా వాటికన్‌ మారనున్నదని చెప్పవచ్చు. అయితే ట్రంప్‌ మాటలకు విశ్వసనీయత, అక్కడేం జరుగుతుందన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ చేయటాన్ని మాస్కో విజయంగా కొందరు వర్ణిస్తున్నారు. కాల్పుల విరమణపై అవగాహనకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌ చెప్పాడని రష్యా అధికారిక వార్తా సంస్థ నొవోస్తి పేర్కొన్నది.అయితే షరతులు వర్తిసాయన్నట్లుగా తమ ప్రతిపాదనల గురించి వెనక్కు తగ్గేదేలేని పుతిన్‌ కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానాలు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ, ఇతర నాటో నేతలతో కూడా ట్రంప్‌ మాట్లాడిన తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తికరంగా తయారైంది. నాటకీయ పరిణామాలు జరుగుతాయా లేక ఎవరి తురుపుముక్కలను వారు ప్రయోగిస్తున్నారా అన్నది చూడాలి.” అహాలు పెద్దగా ఉన్నాయి. అయితే ఏదో ఒకటి జరుగుతుందని భావిస్తున్నా, అది జరగకపోతే నేను తప్పుకుంటా, వాళ్లే చూసుకుంటారు” అని ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి పుతిన్‌ గతంలో స్పష్టం చేసిన మూలకారణాలకు పరిష్కారం కుదిరి తేనే శాంతి అన్న అంశాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పవచ్చు. కరవమంటే కప్పుకు విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉక్రెయిన్‌,దానికి బాసటగా నిలుస్తున్న ఐరోపా అగ్రరాజ్యాలు పుతిన్‌ షరతులను అంగీకరించే అవకాశం కనిపించకపోతే మధ్యలో నాకెందుకు అంటూ ట్రంప్‌ తప్పుకొనేందుకు పూనుకున్నట్లు కూడా కనిపిస్తోంది.దీనికి తోడు మిలిటరీ, గూఢచార సమాచారం అందచేత కూడా నిలిపివేస్తే ఉక్రెయిన్‌ గిలగిలా కొట్టుకుంటుందని విశ్లేషణలు వెలువడ్డాయి. శాంతిచర్చల నుంచి అమెరికా దూరంగా జరగకూడదని, మా అందరికీ అది కీలకమని సోమవారం నాడు పుతిన్‌తో ట్రంప్‌ ఫోన్‌ తరువాత జెలెన్‌స్కీ వ్యాఖ్యానించాడు. రష్యా దౌత్యపరమైన విజయం సాధించిందని కోమ్సోమోలస్కయా ప్రావదా పత్రిక వర్ణించింది.
ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో పోరు ఆగటం లేదు. దీనికి కారకులెవరు? రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతినా లేక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపా? సోమవారం నాడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని ట్రంప్‌ చెప్పాడు. మాట్లాడే ముందు ఐరోపాలో ఉన్న నాటో దేశాల నేతలందరూ ట్రంప్‌తో చర్చించారు. బేషరతుగా చర్చలకు పుతిన్‌ వస్తే సరి లేకుంటే రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాలని చెప్పారు.అణ్వాయుధాలతో పని లేకుండానే ఉక్రెయిన్లో తమ లక్ష్యాలను సాధిస్తామని పుతిన్‌ చెప్పటమేగాక ఆదివారం నాడు రికార్డుస్థాయిలో 273 డ్రోన్లతో దాడి చేయించాడు. సంక్షోభానికి మూల కారణాలను గమనంలోకి తీసుకొని పరిష్కారానికి పూనుకోవాలని, ఆ దిశగా చర్చలకు తాను సిద్ధమే అని పుతిన్‌ మరోసారి చెప్పాడు. ప్రభుత్వ టీవీ విలేకరితో మాట్లాడుతూ అణ్వాయుధాలను ప్రయోగించే తప్పు తమతో చేయించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని అయితే వాటితో నిమిత్తం లేకుండానే పని పూర్తి చేయగలమన్నాడు.తమను భయపెట్టేందుకు ఖండాంతర క్షిపణులతో కవాతు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. పుతిన్‌ ఇంటర్వ్యూను ఆదివారంనాడు టీవీ ప్రసారం చేసంది. సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌ అయిన ఉక్రెయిన్‌ను నాజీకరణ, మిలిటరీ రహితం కావించేందుకు,తటస్థంగా ఉండేందుకు సైనిక చర్యను ప్రారంభించినట్లు 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్‌ భాష మాట్లాడే పౌరుల హక్కుల పరిరక్షణ కూడా మిలిటరీ చర్య ఉద్దేశమని పుతిన్‌ చెప్పాడు. సంక్షోభానికి మూలకారణాల్లోకి వెళ్లే వారు రష్యా ప్రయోజనాలను కూడా గమనంలోకి తీసుకోవాలని పదేపదే చెప్పాడు, అప్పుడే శాశ్వతశాంతి నెలకొంటుందన్నాడు. ఈనెల 16న ఇస్తాంబుల్‌(టర్కీ)లో రష్యా -ఉక్రెయిన్‌ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. ఇరుదేశాల వద్ద ఉన్న యుద్ధ ఖైదీల మార్పిడికి మాత్రమే అంగీకారం కుదిరింది. అమెరికన్లు అంటే అధ్యక్షుడితో సహా మొత్తం అమెరికా జనాలు, నాయకత్వానికి వారి స్వంత జాతీయ ప్రయో జనాలుంటాయి, వాటిని మేము గౌరవిస్తాము, మాక్కూడా అలాగే ఉంటాయి, అదేమాదిరి వాటిని కూడా మన్నించాలని పుతిన్‌ అన్నాడు.
సోమవారం నాడు పుతిన్‌కు ఫోన్‌ చేస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తర్వాత తన మనసులో ఏమున్నదో, ఏమి కోరుకుంటున్నాడో పుతిన్‌ టీవీ ఇంటర్వ్యూ రూపంలో ముందుగానే వెల్లడించటం తప్ప మరొకటి కాదు. దానికి భిన్నంగా చేసే ప్రతిపాదనలను అంగీకరించేది లేదని బహిరంగంగానే స్పష్టం చేశాడు.తమ షరతులకు ఆమోదం తెలిపే వరకు ఒకవైపు చర్చలు జరుపుతూనే సైనిక చర్యను కూడా కొనసాగిస్తామన్న సందేశమిస్తూ ఆదివారం నాడు భారీ ఎత్తున 273 డ్రోన్లతో రష్యా దాడిచేసింది. ఈ దాడి తర్వాత రోమ్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో జెలెన్‌స్కీ సమావేశమై రష్యా మీద మరింత వత్తిడి తేవాలని కోరాడు. ట్రంప్‌ సమక్షంలో ఓవల్‌ ఆఫీసులో ఇద్దరూ గొడవ పడిన తరువాత జరిగిన తొలి భేటీ ఇది.బేషరతుగా, పూర్తిగా యుద్ధాన్ని ఆపకతప్పదు అనుకునేవరకు రష్యాపై ఒత్తిడి పెంచాల్సిందే అని జెలెన్‌స్కీ తరువాత ఒక ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నాడు. కాల్పుల విరమణ గురించి మాట్లాడేందుకు ఇతగాడు ఇస్తాంబుల్‌ రాగా పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా కనీసం ఒక మంత్రిని కూడా పంపలేదు. దాంతో ఉక్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతాన్ని ఆపేందుకు తాను ఫోన్లో మాట్లాడతా నని ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ వైఖరితో ఐరోపా నాటో దేశాలకు దిక్కుతోచటం లేదు. భయంకరమైన యుద్ధాన్ని త్వరలో ఆపేందుకు అమెరికన్లు, యూరోపియన్లు కలసి పని చేయా లని జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఆదివారం నాడు చెప్పాడు. ప్రస్తుత దశలో ఉక్రెయిన్‌కు శాంతి స్థాపక దళాలను పంపటం గురించి మాట్లాటటానికి ఏమీ లేదని, దానికి సుదూరంగా ఉన్నామని, ముందు ఆయుధ ప్రయోగం, మరణాలను ఆపాలి అన్నాడు.తమ ప్రమేయం లేకుండా శాంతి ఒప్పందం కుదరటాన్ని అంగీకరించేందుకు ఐరోపా నేతలు సముఖంగా లేరని మెర్జ్‌ మాటల్లో మారోసారి వెల్లడైంది. అంతకు ముందు అల్బేనియా రాజధాని టిరానాలో రష్యా మీద మరిన్ని ఆంక్షల విధింపు గురించి ఐరోపా నేతలు చర్చలు జరిపారు.
రష్యా సైనిక చర్య ప్రారంభమైన 2022లో టర్కీ చొరవతో తొలిసారి ఇస్తాంబుల్‌ నగరంలో జరిగిన చర్చలు విఫల మయ్యాయి. ఇతర నాటో దేశాల మాట విని జెలెన్‌స్కీ సాకులతో ముందుకు రాలేదు. ఆ తర్వాత తిరిగి మలిసారిగా గత శుక్రవారం నాడు అక్కడే ప్రత్యక్ష చర్చలు జరిగాయి. కేవలం రెండు గంటల పాటు జరిగిన సంప్రదింపుల్లో వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు రెండు దేశాల ప్రతినిధి బృందాలు అంగీకరించాయి. దీనికి ఎలాంటి షరతులు లేవు. శాశ్వత శాంతి ఒప్పందానికి ముందుగా తాత్కాలిక కాల్పుల విరమణకు రష్యా అంగీకరించాలని, అటువైపు నుంచి స్పందన లేదని ఉక్రెయిన్‌ ప్రతినిధి చెప్పాడు. జరిగిందాని పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని, నిరంతరం మాట్లాడేందుకు అందు బాటులో ఉంటామని రష్యన్‌ ప్రతినిధి అన్నాడు. కాల్పుల విరమణ ప్రతిపాదనలను రెండు పక్షాలూ పరస్పరం అందచేసుకోవాలని నిర్ణయించారు. రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ భూభాల నుంచి ఖాళీ చేసేందుకు తమకు ఏమాత్రం అంగీకారం గాని కొత్త షరతులను రష్యా ప్రతిపాదించినట్లు ఉక్రెయిన్‌ ప్రతినిధి చెప్పాడు.
ఉక్రెయిన్‌ యుద్ధ పూర్వరంగంలో తలెత్తిన పరిణామాలను చర్చించేందుకు అల్బేనియా రాజధాని టిరానాలో 47ఐరోపా దేశాల నేతలు సమావేశమయ్యారు.అమెరికా, ఉక్రెయిన్‌, ఐరోపాదేశాలు చేసిన ప్రతిపాదనలకు రష్యా స్పందించలేదని, కొత్త ఆంక్షల గురించి చర్చించారు. అయితే ఐరోపా సమాఖ్య వాటి మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. పుతిన్‌ స్పందించకపోయినా ప్రయత్నాలు కొనసాగించాల్సిందేనని భావించారు.నెల రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ సరే అన్నది. రష్యా తిరస్కరించింది. ఉన్నత స్థాయిలో చర్చలు అవసరమేనని అయితే ట్రంప్‌-పుతిన్‌ భేటీకి సమయం పడుతుందని రష్యా ప్రతినిధి పెష్కోవ్‌ చెప్పాడు.రష్యన్‌ మిలిటరీ సరికొత్త దాడులకు సిద్ధమవుతున్నదని పశ్చిమదేశాల మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. బెలారస్‌కు కొత్త ఆయుధాలు ఇవ్వటంతో పాటు సెప్టెంబరులో సంయుక్తవిన్యాసాలు జరిపేందుకు రష్యా నిర్ణయించటాన్ని వారు చెబుతున్నారు. ఒకవేళ సరికొత్త దాడులు జరిగితే తూర్పు ఐరోపాలోని నాటో సభ్యదేశాలు లాత్వియా, లిథువేనియా, పోలాండ్‌లు ఒక రక్షణగా పనికి వస్తాయని భావిస్తు న్నారు. రానున్నది వేసవి గనుక యుద్ధానికి అనువుగా ఉంటుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌ చర్చలు విఫలమైన నేపధ్యాన్ని బట్టి పోరు సంవత్సరాల తరబడి కొనసాగవచ్చని, తాము భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఉక్రేనియన్లు భావిస్తున్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ” మమ్మల్ని రష్యా నాశనం చేయలేదు, మేము దాని ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను విముక్తి చేయలేము, అమెరికా సాయం లేకుండా ఇప్పుడున్న పరిస్థితిని మార్చలేము ,కొంతకాలం తరువాత త్రాసు రష్యావైపు మొగ్గుతుంది, మేము భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, ఒకటి, రెండు, మూడు ఇంకా దీర్ఘకాలం పట్టినా పోరుకు సిద్దమే. మేము స్వీడన్‌తో 21 సంవత్సరాలు పోరా డాము ” అని ఒక అధికారి చెప్పినట్లు గార్డియన్‌ పత్రిక రాసింది. తమ ఆధీనంలో ఉన్న ఐదు ప్రాంతాల నుంచే గాక లేని చోట్ల కూడా ఉక్రెయిన్‌ మిలిటరీని ఉపసంహరించాలని రష్యా డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు.
శాంతి ఒప్పందం కుదరలాంటే దానికి ముందు తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి.ఏకపక్షంగా ఏదీ జరగదు. శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా, ఐరోపా దేశాలు బెదిరించినా పుతిన్‌ వాటిని పూచికపుల్లలా తీసివేశాడు. ఉడుత ఊపులకు భయపడేది లేదని స్పష్టం చేశాడు. ఉభయపక్షాలకూ ముందు విశ్వాసం కుదరాలి.తమ మీద విధించిన ఆంక్షల సంగతి ముందు తేల్చాలని రష్యా కోరనుంది.అది జరిగిన తర్వాత ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం సంగతి ఏమిటని పుతిన్‌ పట్టుబట్టటం ఖాయం. మూడేండ్లుగా రష్యా స్వాధీనంలోకి వచ్చిన ప్రాంతాల సంగతి తేలాల్సి ఉంది. ఇవేవీ పరిష్కారం కాకుండా శాంతికి రష్యా అంగీకరించే అవకాశం లేదు. వీటిని అంగీకరించటమంటే ఐరోపా దేశాలు ఓడిపోయినట్లే గనుక అందుకు అవి అంగీకరిస్తాయా?
ఎం.కోటేశ్వరరావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -