నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాకిచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్‌దానీ ఎగరేసుకుపోయారు. భారతీయ-ఉగాండ మూలాలున్న ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నిక అధ్యక్షుడికి ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా ‘‘కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్‌దానీ న్యూయార్క్ మేయర్‌గా గెలిస్తే నేను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తాను’’ అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇప్పుడు అతిపిన్న వయస్సు (34 ఏళ్లు)లో న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన వ్యక్తిగా మమ్‌దానీ రికార్డ్ సృష్టించారు.
న్యూయార్క్ మేయర్‌గా గెలిచిన మమ్‌దానీ భారతీయ సినీ డైరెక్టర్ మీరానాయర్ కుమారుడు కావడం విశేషం. ఉంగాండా జాతీయుడైన మహమూద్ మమ్‌దానీ-మీరాకు జన్మించిన సంతానమే జొహ్రాన్. సోషలిస్ట్ భావజాలం ఉన్న అతడు న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై విజయం సాధించడం విశేషం.



