Sunday, July 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ టారిఫ్‌ వార్‌

ట్రంప్‌ టారిఫ్‌ వార్‌

- Advertisement -


– మెక్సికో,యూరప్‌లపై 30శాతం సుంకం
– ఆగస్టు 1 నుంచి అమల్లోకి
– వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు
– తాజా నిర్ణయంతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై టారిఫ్‌ల మోత మోగిస్తున్నారు. ఇటీవల కెనడా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌ వంటి దేశాలపై సుంకాలను విధించిన ట్రంప్‌.. తాజాగా శనివారం మెక్సికో, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి దిగుమతులపై 30 శాతం సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయంతో గ్లోబల్‌ వార్‌ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశమున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
అందుకే ఈయూపై సుంకాలు పెంపు
వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు ఈయూపై సుంకాలు పెంచుతున్నామని ట్రంప్‌ చెప్పారు. ఒకవేళ ఈ దేశాలు ప్రతీకార సుంకాలు విధిస్తే అమెరికా వాటి కంటే ఎక్కువ సుంకాలతో స్పందిస్తుందని హెచ్చరించారు. ఇటీవల కెనడా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌ వంటి దేశాలపై ట్రంప్‌ సుంకాలను విధించారు. ఈ తాజా ప్రకటన ట్రంప్‌ వాణిజ్య విధానంలో ఒక భాగంగా ఉంది. ఈ చర్యలు గ్లోబల్‌ ట్రేడ్‌ వార్‌ను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మెక్సికోకు టారిఫ్‌తో శిక్ష
కీలక వాణిజ్య మిత్రదేశాలైన మెక్సికో, ఈయూలతో వారాల తరబడి చర్చలు జరిగినప్పటికీ సరైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమయ్యాయని ట్రంప్‌ చెప్పారు. ఆగస్టు 1 నుంచి ఈయూ, మెక్సికో నుంచి దిగుమతులపై 30శాతం సుంకం విధిస్తున్నట్టు శనివారం తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం సోషల్‌ ట్రూత్‌ ద్వారా ఆ దేశాలకు లేఖలు పంపారు. మెక్సికోలో కార్టెల్‌లు, ఫెంటానిల్‌ డ్రగ్‌ దిగుమతులను నియంత్రించడంలో విఫలమైనందుకు శిక్షగా మెక్సికోపై టారిఫ్‌ విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌, ముఖ్యంగా కార్టెల్స్‌ ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టడంలో మెక్సికో వైఫల్యం చెందిందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -