నవతెలంగాణ-హైదరాబాద్: చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం వెనిజులాపై యూఎస్ ఆర్మీ దురాక్రమణకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దేశ రాజధాని కాకారస్ పై వైమానిక దాడులకు తెగబడింది. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో తోపాటు ఆయన భార్యను నిర్భంధించి, సైనిక విమానంలో న్యూయార్క్ కు తరలించింది. ఈ ఆకస్మిక పరిణామంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధత్యలు స్వీకరించారు. అమెరికాను చర్యను తీవ్రంగా ఖండించారు. వారి పరిరక్షణ కోసం కమిషన్ కూడా వేశారు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
తాజాగా ఆమె వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. అమెరికాకు అన్ని విధాలుగా సహకరించాలని లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని దిగజారుడు మాటలు మాట్లాడారు. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందంటూ ప్రగల్భాలు పలికారు. వెనిజులాపై అమెరికా నియంత్రణకు అంగీకరించాల్సిందేనని ట్రంప్ తేల్చిచెప్పారు.
ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన కానుంచి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, నిబంధనలను ఉల్లంఘిస్తునే ఉన్నారు. యూఎస్ గ్రేట్ ఎగైన్ అనే పేరుతో హద్దులేకుండా టారిప్‌లు మోత మోగించారు. ట్రంప్ చర్యలతో ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి. నో కింగ్ పేరిట యూరప్ దేశాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కెనడా, చైనా, యూరోపియన్ దేశాలు ప్రతిఘటించడంతో పాటు ప్రతీకార సుంకాలు విధించాయి. దీంతో మొండి పట్టును వీడిన ట్రంప్.. వెనక్కి తగ్గి తన టారిఫ్‌లను వాయిదా వేసుకున్నారు. టారిఫ్‌ల వార్‌లో చైనాతో ఢీకొనలేక చేతికల పడిపోయి.. ఆదేశంతో పలు దఫాలుగా చర్చలు సాగించి..సానుకూలంగా ఒప్పందాలు చేసుకున్నారు.
అణు ఆయుధాల బూచి పేరుతో ఇరాన్‌పై ప్రత్యక్ష దాడులకు ట్రంప్ పాల్పడ్డారు. ఆ దేశ అణు స్థావరాలపై దాడులు చేశామంటూ బీరాలు పలికారు. ఇజ్రాయిల్ దాడులకు సహకరిస్తూ ప్రపంచశాంతికి ట్రంప్ విఘాతం కల్గించారు. అమెరికా దాడులకు దీటుగా ఇరాన్ స్పందించింది. దీంతో తోకముడిచిన ట్రంప్ మాటలకు పని చెప్పారు. ఆ తర్వాత ఇజ్రాయిల్‌ను ఆదేశంపైకి ఉసుగొల్పారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడిని సమర్థిస్తునే..ఉక్రెయిన్-రష్యాల మధ్య శాంతి చర్చలు జరగాలని కొంగ జపం చేశారు.
ఆ యుద్ధాన్ని ట్రంప్ నిలువరించలేక భారత్ పై అదనపు సుంకాల మోత మోగించారు. అంతటితో కాకుండా భారతీయులే లక్ష్యంగా హెచ్1బీ వీసాల ఫీజును పెంచారు. ఇండియా దిగుమతులపై పలు ఆంక్షలు విధించారు. ఇండియా సినిమాలే లక్ష్యంగా ఆ రంగంపై టారిఫ్‌లను పెంచారు. భారత్ లక్ష్యంగా ఫార్మా రంగాన్ని దెబ్బకొట్టాలని ట్రంప్ అతి తెలివి ప్రదర్శించారు. ఇంకనూ ఇండియా పట్ల ట్రంప్ తన అక్కసును పలు విధాలుగా చూపిస్తునే ఉన్నారు.



