Friday, September 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ మ‌రో టారిఫ్‌ బాంబు.. ఫార్మా దిగుమతులపై 100శాతం సుంకం

ట్రంప్ మ‌రో టారిఫ్‌ బాంబు.. ఫార్మా దిగుమతులపై 100శాతం సుంకం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల దూకుడును మరింత వేగవంతం చేశారు. బ్రాండెడ్‌ పేటెంట్‌ పొందిన ఫార్మా దిగుమతులపై 2025 అక్టోబర్‌1 నుండి 100శాతం వరకు సుంకం విధించనున్నట్లు గురువారం ప్రకటించారు. తాజా టారిఫ్‌లతో భారతదేశ ఔషద రంగం తీవ్రంగా ప్రభావితం కానుంది. ”2025 అక్టోబర్‌ 1 నుండి ఏదైనా బ్రాండెడ్‌ లేదా పేటెంట్‌ పొందిన ఫార్మాన్యూటికల్‌ ఉత్పత్తులపై మేము 100శాతం సుంకాన్ని విధిస్తాము. ఫార్మాన్యూటికల్‌ కంపెనీలు అమెరికాలో ఒక తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తే .. ఆ సంస్థల ఔషద ఉత్పత్తులపై ఎటువంటి సుంకం ఉండదు. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు ” అని ఆయన తన సోషల్‌మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు.

ట్రంప్‌ తన తాజా టారిఫ్‌ల విధింపులో.. కిచెన్‌ క్యాబినెట్‌లు మరియు బాత్రూమ్‌ పరికరాల దిగుమతులపై 50శాతం, ఫర్నిచర్‌ బిగింపులపై 30శాతం, భారీ ట్రక్కులపై 25శాతం సుంకాన్ని విధించారు.

భారత్‌పై ప్రభావం..
ఫార్మాన్యూటికల్‌ ఉత్పత్తులకు అమెరికా భారతదేశపు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌. 2024 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం 27.9 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతుల్లో, 31శాతం లేదా 8.7 బిలియన్‌ డాలర్లు (సుమారురూ.77,138 కోట్లు) అమెరికాకు వెళ్లాయని ‘ఫార్మాన్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ అనే సంస్థ పేర్కొంది. 2025 మొదటి అర్థభాగంలో 3.7 బిలియన్‌ డాలర్ల (రూ.32,505కోట్లు) విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.

నివేదికల ప్రకారం.. అమెరికాలో వినియోగించే జెనరిక్‌ ఔషదాలలో 45 శాతం మరియు బయోసిమిలర్‌ ఔషదాలలో 15శాతం భారత్‌ సరఫరా చేస్తోంది. డా.రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌, సన్‌ ఫార్మా మరియు గ్లాండ్‌ ఫార్మా వంటి సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 30-50శాతం వరకు అమెరికన్‌ మార్కెట్‌ నుండి వస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా అమెరికన్లు భారతదేశంలో తయారు చేయబడిన తక్కువ ధరకు లభించే జనరిక్స్‌పై ఆధారపడతారు. అధిక సుంకాలతో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మరియు దేశంలో ఔషద కొరతకు దారితీయవచ్చు. యుఎస్‌ జనరిక్స్‌ రంగంలో స్వల్ప మార్జిన్‌తో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు, వాటిపై సుంకాలు విధించినట్లయితే.. అదనపుఖర్చులను భరించడం కష్టతరం కావచ్చు. లేదా చివరికి వాటిని వినియోగదారులు లేదా బీమా సంస్థలకు బదిలీ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -