మరియా కొరీనా మచాడోకు శాంతి బహుమతి
ఈసారి వెనిజులా నేతకు దక్కిన అవకాశం
యుద్ధాలు ఆపానన్న అమెరికా అధ్యక్షుడికి దక్కని గౌరవం
తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కిన శ్వేతసౌధం
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఆకాంక్షలకు అనుగుణంగా బహుమతులు ప్రకటన
ఇవి ట్రంప్ వాదనలను బట్టి ఉండవు : నోబెల్ కమిటీ స్పష్టీకరణ
ఓస్లో : ప్రపంచంలో పలు యుద్ధాలు ఆపాననీ, ఈ సారి నోబెల్ శాంతి బహుమతి తననే వరిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది శాంతి బహుమతి వెనిజులాకు చెందిన ప్రతిపక్ష కార్యకర్త, ఎంపీ మరియా కొరీనా మచోడాకు దక్కింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మచోడా చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నాని నోబెల్ కమిటీ తెలిపింది. వాస్తవానికి ఈ సారి నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే.. ఈ సారి ఈ అత్యున్న పురస్కారాన్ని ఆశించిన వారిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉండటమే. ఎనిమిది యుద్ధాలను నివారించిన తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ట్రంప్ ఇటీవలి కాలంలో అనేక ప్రకటనలు చేశారు. దానిపై ఎన్నో ఆశలూ పెట్టుకున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ రష్యా, ఇజ్రాయిల్, పాక్ సహా పలు దేశాలతో నామినేట్ కూడా చేయించుకున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోతే అమెరికాకే అవమానమని వ్యాఖ్యలూ చేశారు. ట్రంప్ అంతటితో ఆగకుండా.. మాజీ అధ్యక్షుడు ఒబామా పైనా అక్కసు వెళ్లగక్కారు. ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి రావటంపై స్పష్టత లేనప్పటికీ.. ప్రపంచం కోసం ఏమీ చేయకపోయినా ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారంటూ అసంతృప్తిని వెలిబుచ్చారు. ఒకపక్క ఆశ, మరోపక్క అసంతృప్తి నడుమ నోబెల్ కమిటీ తాజాగా శాంతి బహుమతిని వెనిజులా నేతకు ప్రకటించింది. ట్రంప్‌ను ఏ మాత్రమూ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అమెరికా అధ్యక్షుడికి మరోసారి నిరాశే ఎదురైంది.కాగా ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్ష భవనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నోబెల్ కమిటీకి శాంతి కంటే రాజకీయాలే ఎక్కువయ్యాని వ్యాఖ్యా నించింది. ”నోబెల్ రాకపోయినా ట్రంప్ శాంతి ఒప్పందాలు కుదురు స్తారు. యుద్ధాలను నివారిస్తారు. ప్రజల ప్రాణాలు కాపాడతారు. తన మనోబలంతో పర్వతాలను సైతం కదిలించగలిగిన ట్రంప్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు” అని అధ్యక్ష భవనం ప్రతినిధి స్టీవెన్ చుంగ్ చెప్పుకొచ్చారు.
ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా విజేతలను ఎంచుకుంటాం : నోబెల్ కమిటీ
అమెరికా అధ్యక్ష భవనం నుంచి తీవ్ర అసంతృప్తి, ఆరోపణలు రావటంతో నోబెల్ కమిటీ నుంచి స్పందన వచ్చింది. ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి రాలేదని అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో నోబెల్ కమిటీ చైర్మెన్ జొర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్ వివరణ ఇచ్చారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఆకాంక్షలకు అనుగుణంగా నోబెల్ బహుమతులు ప్రకటిస్తామే తప్ప ట్రంప్ వాదనలను బట్టి కాదని స్పష్టం చేశారు. నోబెల్ కమిటీ మీడియా, బహిరంగ ప్రచారాలను నిరంతరం గమనిస్తుంటుందనీ, నోబెల్ గ్రహీతల చిత్రాలు ఉన్న గదిలో కూర్చోని ఆ లేఖలను మేం చూస్తామని వివరించారు. ఆ గది తమకు ధైర్యాన్నిస్తుందనీ, సమగ్రతతో పని చేసే సంకల్పాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా తాము నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. కాగా ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతులు పొందిన అమెరికా అధ్యక్షులు నలుగురు మాత్రమే ఉన్నారు. వారిలో థియోడోర్ రూజ్‌వెల్ట్ (1906), వుడ్‌రో విల్సన్ (1919), జమ్మీ కార్టర్ (2002), బరాక్ ఒబామా (2009)లు ఈ జాబితాలో నిలిచారు.
ట్రంప్ నోబెల్ ఆశలు ఆవిరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES