నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారం భారత్‌లో పర్యటించనున్నారు. రాజస్థాన్‌లోని “సరస్సుల నగరం”గా ప్రసిద్ధి చెందిన ఉదయ్‌పుర్‌లో జరిగే ఓ వివాహ వేడుకకు ఆయన కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. నవంబర్ 21, 22 తేదీల్లో ఈ వేడుక జరగనుంది.
ఓ ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త కుమారుడి డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఉదయ్‌పుర్‌లోని పిచోలా సరస్సు మధ్యలో ఉన్న సుప్రసిద్ధ జగ్ మందిర్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వస్తున్న ట్రంప్ జూనియర్, నగరంలోని లీలా ప్యాలెస్‌లో విడిది చేయనున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ జూనియర్ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌కు చెందిన ఒక బృందం ఇప్పటికే ఉదయ్‌పుర్‌కు చేరుకొని ఏర్పాట్లను సమీక్షిస్తోంది. మరోవైపు, స్థానిక పోలీసులు విమానాశ్రయం నుంచి ప్యాలెస్ వరకు పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వివాహ మహోత్సవానికి ట్రంప్ కుటుంబంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల వారు కూడా హాజరుకానుండటంతో నగరం సందడిగా మారనుంది.



