అమెరికా కంపెనీలకు
శాపంగా మారిన దిగుమతి సుంకాలు
కుదేలవుతున్న టెక్ దిగ్గజాలు
జేబులు ఖాళీ చేసుకుంటున్న వినియోగదారులు
వాషింగ్టన్ : వాణిజ్య యుద్ధం ప్రారంభించే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏమన్నారో గుర్తుందా? అమెరికా పౌరులకు ఉద్యోగాలు కల్పించడం, వాణిజ్య లోటును తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడుతున్న దేశీయ కంపెనీలకు సమానావకాశాలు కల్పించడం తన లక్ష్యమని ఆయన ఆ సమయంలో చెప్పుకొచ్చారు. అయితే నెలల తరబడి ఎడతెగని చర్చలు జరిపినప్పటికీ అమెరికా డిమాండ్లకు తలవంచడానికి అనేక దేశాలు నిరాకరించాయి. ఫలితంగా ట్రంప్ వ్యూహం బెడిసికొట్టింది.
ఆపిల్ నుంచి న్విడియా వరకూ…
ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై సుంకాలు విధించారు. దీంతో చైనా కంపెనీలు తమ ఎగుమతులను వియత్నాం, థాయిలాండ్, భారత్ వైపు మళ్లించాయి. ఇప్పుడు ట్రంప్ ఈ దేశాలను కూడా వదలలేదు. ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధం కారణంగా ఆపిల్ నుంచి న్విడియా వరకూ అనేక అమెరికా కంపెనీలు తమకు అవసరమైన విడిభాగాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎందుకంటే అవి తమకు కావాల్సిన కీలక భాగాలను ఆసియా దేశాల నుంచే కొనుగోలు చేస్తుంటాయి. ఆసియా ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇదేమంత మంచి వార్త కాదు. జపాన్ కార్లు, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్, తైవాన్ చిప్స్…ఇలా అనేక ఆసియా దేశాలు ఎగుమతులు, విదేశీ పెట్టుబడుల కారణంగా తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకున్నాయి. ఆయా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌తో అవి అనేక సంవత్సరాలుగా వాషింగ్టన్‌తో వాణిజ్య మిగులును నమోదు చేసుకుంటున్నాయి. ఆసియా తయారీ రంగం అమెరికా ఉద్యోగాలను హరిస్తోందని ట్రంప్ ఆరోపించడానికి ఇది ఓ కారణం.
నష్టాల బాటలో ఆపిల్
మేలో ఆపిల్ సీఈఓతో సమావేశమైనప్పుడు ‘మీరు చైనాలో అనేక సంవత్సరాలుగా ప్లాంట్లు నిర్మిస్తున్నారు. దీనిపై మేమేమీ అనడం లేదు. మీరు భారత్‌లో ప్లాంట్లు నిర్మించడం మాకు ఇష్టం లేదు. ఆ దేశం తన వ్యవహారాలను తాను చూసుకోగలదు’ అని ట్రంప్ చెప్పారు. చైనా, వియత్నాం, భారత్‌లో తయారయ్యే ఐఫోన్లను విక్రయించడం ద్వారా ఆపిల్ తన మొత్తం ఆదాయంలో సుమారు యాభై శాతం ఆర్జిస్తోంది. ఆపిల్ సంస్థ ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో బంపర్ ఆదాయం పొందింది. కానీ ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన తర్వాత దాని పరిస్థితి అనిశ్చితిలో పడింది. సుంకాల దెబ్బతో గడచిన త్రైమాసికంలో తమ సంస్థ 800 మిలియన్ డాలర్లు నష్టపోయిందని, ప్రస్తుతం నడుస్తున్న త్రైమాసికంలో 1.1 బిలియన్ డాలర్లు కోల్పోయే అవకాశం ఉన్నదని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
ట్రంప్ విధానంతో కుదేలు
టెక్ కంపెనీలు సాధారణంగా తమ వ్యాపార వ్యూహాలను ముందుగానే నిర్ణయించుకుంటాయి. కానీ ట్రంప్ అనుసరిస్తున్న అనూహ్య టారిఫ్ విధానంతో వాటి వ్యాపారాలన్నీ కుదేలవుతున్నాయి. ఉదాహరణకు అమెజాన్ ఆన్‌లైన్ వ్యాపారాన్నే తీసుకుందాం. అమెరికాలో జరిపే విక్రయాలకు ఆ సంస్థ చైనాపై ఆధారపడుతుంది. అయితే అమెరికాలోకి ప్రవేశించే చైనా దిగుమతులపై టారిఫ్ ఎంత విధిస్తారో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే చైనాతో అమెరికా ఇంకా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేదు. అందుకు ఈ నెల 12వ తేదీ వరకూ సమయం ఉంది. పరస్పరం సుంకాలను తగ్గించుకోవడానికి అంగీకరించడానికి ముందు కొన్ని వస్తువులపై ఈ రెండు దేశాలు విధించుకున్న ప్రతీకార టారిఫ్‌లు ఓ దశలో 145 శాతానికి చేరాయి. అమెరికాలో అమ్ముడవుతున్న ఐఫోన్లలో ఎక్కువ భాగం భారత్ నుంచే వస్తున్నాయని కుక్ చెప్పారు. అయితే అమెరికాతో సకాలంలో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేకపోవడంతో ఆ దేశం నుంచి జరిగే దిగుమతులపై ట్రంప్ పాతిక శాతం సుంకం విధించారు.
ట్రాన్స్-షిప్పింగ్ మరింత భారం
ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు అమెరికాకు తమ ఉత్పత్తులను పంపడానికి పలు సంస్థలు వియత్నాం, థాయిలాండ్ దేశాలను ఎంచుకున్నాయి. వాటి ద్వారా అమెరికాకు తమ వస్తువులను చేరవేసి సుంకాల దెబ్బ నుంచి తప్పించుకున్నాయి. దీనినే ట్రాన్స్-షిప్పింగ్ అంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ దేశం ద్వారా సరుకు పంపినా సుంకం తప్పదు. ఆసియా దేశాలతో అమెరికా జరిపిన చర్చలలో ట్రాన్స్-షిప్పింగే ప్రధానాంశం అయింది. వియత్నాం దిగుమతులపై అమెరికా 20 శాతం సుంకం విధిస్తోంది. అదే ట్రాన్స్-షిప్పింగ్ ద్వారా అయితే 40 శాతం టారిఫ్ కట్టాలని ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో సెమీకండక్టర్ల వంటి ఆధునిక పరికరాలను ఉత్పత్తి చేయడం ఇప్పుడు మరింత కష్టమవుతుంది. ప్రపంచంలోని చిప్‌లలో సగానికి పైగా సెమీకండక్టర్లే. వీటిలో ఎక్కువ భాగం తైవాన్ నుంచి వస్తాయి. ఇప్పుడు వాటిపై ట్రంప్ 20 శాతం సుంకం విధించారు.
మినహాయింపులు లేవు
ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణంగా భారీగా నష్టపోయేది ఆసియాలోని ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు, చైనా విక్రేతలు. అదే విధంగా చైనా విక్రేతలు, ఆ దేశ మార్కెట్లపై ఆధారపడే అమెరికా కంపెనీలు కూడా. 800 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన పార్సిల్స్‌ను సుంకాల నుంచి మినహాయించే నిబంధనను ట్రంప్ మేలో అటకెక్కించారు. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే పార్సిల్స్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పశ్చిమ దేశాలలో ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా భారీ లాభాలు మూటకట్టుకుంటున్న షెయిన్, టెము వంటి రిటైల్ సంస్థలకు ఇది గట్టి దెబ్బ. ఇప్పుడు ఈబే, ఎట్సీ వంటి అమెరికా సైట్లు కూడా ఈ మినహాయింపును కోల్పోయాయి. ఫలితంగా అమెరికాలో సెకండ్ హ్యాండ్, వింటేజ్, హ్యాండ్‌మేడ్ వస్తువుల ధరలు పెరుగుతాయి.
అమెరికన్ల కోసమే తాను సుంకాలు విధిస్తున్నానని ట్రంప్ చెబుతుంటారు. కానీ లోతుగా విశ్లేషిస్తే ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్న ప్రస్తుత కాలంలో అమెరికా సంస్థలు, వినియోగదారులు కూడా బాధితులుగా మారుతున్నారు. ట్రంప్ సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో విజేతలెవరో తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
బెడిసికొట్టిన ట్రంప్ వ్యూహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES