నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులకు వైట్‌హౌస్‌లో ఘనంగా విందు ఇచ్చారు. గత రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), టెక్నాలజీ సంస్థల అధిపతులు హాజరయ్యారు. ఏఐ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ విందులో ప్రథమ మహిళ మెలనియా ట్రంప్, జుకర్‌బర్గ్‌ల మధ్య ట్రంప్ ఆసీనులయ్యారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, ఒరాకిల్ సీఈవో సఫ్రా క్యాట్జ్ వంటి 12 మందికి పైగా ప్రముఖులు ఈ విందుకు హాజరైన వారి జాబితాలో ఉన్నారు. అయితే, ఒకప్పుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండి, ప్రస్తుతం దూరంగా ఉంటున్న ఎలాన్ మస్క్ ఈ విందుకు హాజరుకాకపోవడం గమనార్హం. వీరిద్దరి మధ్య ఈ ఏడాది ఆరంభంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
ఒకవైపు ట్రంప్ టెక్ దిగ్గజాలతో సంబంధాలు మెరుగుపరచుకుంటుంటే, మరోవైపు ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ నుంచే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ సన్నిహితుడైన సెనేటర్ జాష్ హాలీ, టెక్ పరిశ్రమపై, ముఖ్యంగా ఏఐ నియంత్రణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. “టెక్ దిగ్గజాలు ఏం నిర్మించాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏఐ వ్యవస్థలను తనిఖీ చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ అధ్యక్షతన వైట్‌హౌస్‌లో ‘ఏఐ ఎడ్యుకేషన్ టాస్క్‌ఫోర్స్’ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “రోబోలు వచ్చేశాయి. మన భవిష్యత్తు ఇక సైన్స్ ఫిక్షన్ కాదు. ఏఐ ఎదుగుదలను తల్లిదండ్రులుగా, నాయకులుగా మనం బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలి. మన పిల్లలకు శక్తినిస్తూనే, ఎలా అయితే జాగ్రత్తగా గమనిస్తామో, ఏఐ విషయంలోనూ అలాగే వ్యవహరించాలి” అని పిలుపునిచ్చారు.