నవతెలంగాణ-హైదరాబాద్ : తుని కోమటి చెరువులో నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ హాస్పటల్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మైనర్ బాలిక లైంగికదాడి కేసులో నారాయణరావుని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసుల తెలిపారు.
కాగా.. కాకినాడ జిల్లా తుని పట్టణంలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక టీడీపీ నేత నారాయణరావు ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ బాలికను “ఇంటికి తీసుకెళ్తాను” అంటూ స్కూల్ నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక, విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే నారాయణరావును ప్రశ్నించగా, అతడు వారితో గొడవకు దిగినట్లు తెలుస్తుంది. తాను కౌన్సిలర్ అని చెప్పుకుంటూ అక్కడకి వచ్చిన వారిపై బెదిరింపులకు కూడా దిగాడని గ్రామస్థులు చెప్పారు. అయితే, ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల నుంచి అమ్మాయిని ఎలా పంపించారు? అని ప్రశ్నించారు. ఈ ఘటన అనంతరం నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు.