Thursday, May 29, 2025
Homeజాతీయంఇకపై రోజుకు 25 గంటలు?

ఇకపై రోజుకు 25 గంటలు?

- Advertisement -

– నెమ్మదిస్తున్న భూభ్రమణం
– చంద్రుడు, గ్రహాల గమనం ప్రభావం
– అలా జరిగితే టైం సిస్టమ్‌లో మార్పులే
– ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్న శాస్త్రవేత్తలు
భూమి తన చుట్టూ తాను తిరిగే సమయాన్ని ఆధారంగా చేసుకొని మనం ఒక రోజుకు 24 గంటలుగా నిర్దేశించుకున్నాం. దీని ఆధారంగానే మానవుడు తన కార్యకలాపాలను సాగిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 24 గంటలు అనే సమయాన్ని ఆధారంగా చేసుకొన్ని ఎన్నో వ్యవస్థలు నడు స్తున్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి ఇది కొనసాగుతోంది. అయితే, ఇలా రోజుకు నిర్దేశించిన 24 గంటలు అనే టైం సిస్టమ్‌ కనుమరుగవనున్నదా? అది ఇక చరిత్రకే పరిమితం కానున్నదా? ఇకపై రోజుకు 25 గంటలు ఉండనున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. కారణం.. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం తగ్గిపోవ టమే. గత కొన్నేండ్లుగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
న్యూఢిల్లీ :
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు.. విశ్వంలో కీలకమైనవి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుండటంతో అంతరిక్షానికి సంబంధించిన అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అంతరిక్షంలో భాగమైన భూమి అనే గ్రహంపై మానవుడు తన మనుగడను సాగిస్తున్నాడు. గ్రహాలు ఉనికిలో ఉండాలంటే అవి స్థిరంగా కాకుండా చలనంలో ఉంటాయి. సూర్యుడు కేంద్రంగా గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ.. సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూమి కూడా అంతే. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని ‘భూభ్రమణం’ అని, సూర్యుడి చుట్టూ తిరగటాన్ని ‘భూపరిభ్రమణం’ అని అంటారు. భూభ్రమణం అనేది ఒక రోజును( 24 గంటలు) నిర్దేశిస్తే.. భూపరిభ్రమణం అనేది ఒక సంవత్సర కాలాన్ని సూచిస్తుంది. దీనికి పట్టే కాలం అక్షరాలా 365 రోజుల ఆరు గంటల తొమ్మిది నిమిషాలు.
ప్రతి రోజూ సూక్ష్మంగా నెమ్మదిస్తున్న భూభ్రమణం
ఇక ఇప్పటి వరకూ ఉన్న రోజుకు 24 గంటల టైమ్‌ సిస్టమ్‌ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రోజుకు 25 గంటలు రాబోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూభ్రమణం నెమ్మదిస్తుండటమే దీనికి కారణమని వారు వివరిస్తున్నారు. చంద్రుని టగ్‌, గ్రహాల గమనం మారటం కారణంగా గడియారం రోజుకు 25 గంటల వైపునకు పయనిస్తున్నదని అంటున్నారు. ”ప్రతి రోజూ భూమి భ్రమణం కొద్దిగా నెమ్మదిస్తోంది. ఇది సూక్ష్మంగా ఉంటుంది. ఇది మిలియన్ల ఏండ్లుగా పెరుగుతుంది. ఇక 24 గంటల సైకిల్‌ తాత్కాలిక తప్పిదం కావచ్చు. చంద్రుడి ప్రభావం.. భూమి భ్రమణం నెమ్మదించేలా చేస్తున్నది. దాని అలల ఆకర్షణ ఘర్షణను సృష్టిం చటం కారణంగా రోజును ఒకేసారి ఒక మైక్రోసెకన్‌ పొడిగించేలా చేస్తుంది” అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఒకప్పుడు రోజుకు పది గంటలే
కొన్ని లక్షల ఏండ్ల క్రితం భూమి తన చుట్టూ తాను వేగంగా తిరిగేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అప్పటి నుంచి భూభ్రమణంలో అనేక మార్పులు వస్తున్నాయని అంటున్నారు. 4.5 బిలియన్‌ ఏండ్ల క్రితం భూమి వేగంగా తిరిగేదనీ, దీంతో ఒక రోజు పది గంటల్లోనే గడిచిపోయేదని వారు వివరిస్తున్నా రు. ఆ తర్వాత భూభ్రమణం మందగించటం ద్వారా అది కాస్తా 24 గంటలకు పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమికి సంబంధించి టైమ్‌ స్లిప్‌ను హైటెక్‌ లేజర్లు బహిర్గతం చేస్తున్నాయని అంటున్నారు. ఇక రోజుకు 25 గంటల షెడ్యూల్‌ అయితే.. మానవుడి రోజువారీ జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. ఇది మానవుడి నిద్ర సమయాలు, పని తీరులు, షిఫ్టులు వంటి వాటిపై ప్రభావం చూపుతాయి. ఇప్పటి వరకు 24 గంటలపై నిర్మించిన ప్రపంచ వ్యవస్థ పలు మార్పులకు గురయ్యే అవకాశం ఉన్నది. విమానయాన సంస్థల నుంచి అణు గడియారాల వరకు ప్రస్తుతం పాటిస్తున్న సమయ పాలన ప్రపంచాన్ని రీసెట్‌ చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.

భూభ్రమణం ఇలా..

భూమి తన స్వంత అక్షం చుట్టూ తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు. ఈ భూభ్రమణం కారణంగానే పగలు, రాత్రి, కాలాలు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం అక్షరాలా 23 గంటల 56 నిమిషాల నాలుగు సెకన్లు. అంటే దాదాపు 24 గంటలు. దీనిని మనం ఒక రోజుగా పరిగణిస్తాం. చాలా కాలంగా ఇది కొనసాగుతూ వస్తున్నది. అయితే, భూమి వేగంగా తిరుగుతోందా, లేదా? అనే అంశంపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్ల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు పరిశోధకులైతే.. భూమి లోపలి కోర్‌ భ్రమణం వేగంగా మందగిస్తున్నట్టు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -