నవతెలంగాణ-హైదరాబాద్ : గేటెడ్ కమ్యూనిటీలోని ఈత కొలనులో మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన అమీన్‌పూర్ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. అమీన్‌పూర్ అర్బన్ రైజ్ స్ప్రింగ్ ఇన్ ది ఎయిర్ గేటెడ్ కమ్యూనిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు షణ్ముఖ కుమార్, విజయ్‌రెడ్డి నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం షణ్ముఖ కుమార్, కుమార్తె ప్రజ్ఞ (9), విజయ్‌రెడ్డి కుమార్తె ఆద్వికారెడ్డి(8)లు కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లారు. అయితే పిల్లల ఈత కొలనుకు బదులు పెద్దల కొలనుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి మునిగారు. గమనించిన సిబ్బంది వెంటనే బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటలకు ప్రజ్ఞ, సోమవారం తెల్లవారుజామున ఆద్వికారెడ్డి మృతిచెందింది. షణ్ముఖకుమార్ స్వస్థలం విశాఖపట్నం కాగా, ప్రజ్ఞ మియాపూర్‌లోని ప్రయివేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. విజయ్‌రెడ్డి స్వస్థలం కృష్ణా జిల్లా కాగా, ఆద్వికారెడ్డి చందానగర్‌లో మూడో తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం..స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

