నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పలు ఫ్రాంఛైజీలు కొత్తగా కన్పించే అవకాశముంది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
‘‘ఒకటి కాదు.. రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలిసింది. అవే ఆర్సీబీ, ఆర్.ఆర్ వీటిని దక్కించుకునేందుకు నలుగురు, ఐదుగురు కొనుగోలుదారులు రేసులో ఉన్నారు. వారిలో ఈ ఫ్రాంఛైజీలు ఎవరికి దక్కనున్నాయో..! పుణె, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, యూఎస్‌ఏ.. కొత్త యజమానులు ఎక్కడి నుంచి వస్తారో..?’’ అని హర్ష్ గొయెంకా తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్.. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ కంపెనీకి ఫ్రాంఛైజీలో 65శాతం వాటా ఉంది.
ఇటీవల ఆర్సీబీ యజమాని అయిన డియాజియో కంపెనీ ఈ ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు ఆ సంస్థ తెలిపింది.



