నవతెలంగాణ-హైదరాబాద్: క్యూబాకు చేరాల్సిన రెండు మెక్సికన్ మానవతా సాయం నౌకలు కరేబియన్ జలాల్లో గల్లంతయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 24, 25 తేదీల్లో క్యూబాకు చేరుకోవాల్సిన రెండు నౌకలు గల్లంతయ్యాయని, వాటిని గుర్తించేందుకు కరేబియన్ సముద్ర జలాల్లో గాలింపు మరియు సహాయక చర్యలు ప్రారంభించినట్లు మెక్సికో నౌకాదళం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ దేశాలకు చెందిన తొమ్మిది మంది సిబ్బందితో, ఈ రెండు నౌకలు మార్చి 20న మెక్సికన్ రాష్ట్రమైన క్వింటానా రూలోని ఇస్లా ముజెరెస్ నుండి క్యూబాకు బయలుదేరాయని పేర్కొంది.
అనంతరం నౌకల నుండి ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. అయితే ఈ కాన్వారుకి చెందిన వేరొక నౌక మంగళవారం (మార్చి 24)న క్యూబాకు చేరుకుంది. దీర్ఘకాలంగా విద్యుత్ కోతలు, ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు క్షేత్రస్థాయి సహాయక చర్యల్లో భాగంగానే ఈ రెండు నౌకలను పంపినట్లు పేర్కొంది. పోలాండ్, ఫ్రాన్స్, క్యూబా, అమెరికాలోని సముద్ర రక్షణ సమన్వయ కేంద్రాలతో పాటు, నౌకలో ఉన్న వారి దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు నౌకాదళం ఆప్రకటనలో పేర్కొంది.



