నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం ప్రపంచ దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు ఆ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణతో పలు రోజులు శాంతించిన ఇరు దేశాలు..ఇటీవల భీకర దాడులు ప్రారంభించాయి. ఈక్రమంలో ఉక్రెయిన్‌లోని డోనెత్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను తమ సైన్యం స్వాధీనం చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
సిరెడ్‌నె, క్లెబన్ బైక్ గ్రామాలు ఇప్పుడు రష్యా నియంత్రణలోకి వెళ్లాయని ప్రకటించింది. అంతేకాకుండా రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనిక సముదాయంపై దాడులు జరిపినట్టు తెలిపింది. 143 ప్రాంతాల్లో ఉక్రెయిన్ సాయుధ దళాలు, విదేశీ యోధుల తాత్కాలిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగానే గత వారం నాలుగు వైమానిక బాంబులు, 160 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా తెలిపింది.