నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులకు ఉమర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పారు.చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. విక్టోరియా గ్రౌండ్‌లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని శనివారం సాయంత్రం సజ్జనార్ పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
కాలాపత్తర్ రౌడీషీటర్ ఉమర్ సెల్‌ఫోన్ చోరీకి యత్నించాడని సజ్జనార్ తెలిపారు. పట్టుకునే సమయంలో పోలీసులపై దాడికి యత్నించాడని పేర్కొన్నారు. పరిస్థితి చేయి జారకుండా ఉండాలని డీసీపీ చైతన్య కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనలో ఒక దొంగ పరారయ్యాడని.. మరో దొంగ ఉమర్ పట్టుబడ్డాడని చెప్పారు. ఉమర్‌పై గతంలో 25 కేసులు ఉన్నాయని తెలిపారు. అతనిపై రౌడీషీట్ కూడా ఉందని పేర్కొన్నారు.
కాగా, ఇవాళ హైదరాబాద్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం చైతన్య తిరిగి తన కార్యాలయానికి వస్తున్నారు. చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే ఓ ఇద్దరు దొంగలు సెల్‌ఫోన్లను చోరీ చేసి పారిపోతున్నారు. ఆ సెల్‌ఫోన్ స్నాచర్స్‌ను గమనించిన డీసీపీ చైతన్య తన గన్‌మెన్‌ను అప్రమత్తం చేశారు. డీసీపీ, గన్‌మెన్ కలిసి ఆ ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు యత్నించారు.
ఈ క్రమంలో దొంగలు.. డీసీపీపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దొంగలను గన్‌మెన్ అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ తోపులాటలో గన్‌మెన్ కింద పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య.. గన్‌మెన్ వద్ద ఉన్న వెపన్‌ను తీసుకుని దొంగలపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరిలో ఒక దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. దొంగకు ఛాతి, వెన్ను భాగంలో గాయాలు కావడంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.



