నేడు వనపర్తి నియోజకవర్గంలో బహిరంగ సభకు అనుమతి రద్దు దుర్మార్గం : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తున్నదని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు వంద రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతుగా గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అనుమతి రద్దు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు నిరంజన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందు సమావేశానికి అనుమతులు ఇచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనుమతులు రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏడు టీఎంసీల ఏదుల రిజర్వాయర్ ఉండగా పక్కనే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికికాంగ్రెస్ సర్కార్ పూనుకున్నదని తెలిపారు.
కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే తెరమీదకు ఈ రిజర్వాయర్ నిర్మాణం తెరమీదకు వచ్చిందని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తే నార్లాపూర్, ఏదులతోపాటు వట్టెం, కరివెనలో నీటిని నింపుకునే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువల టెండర్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. చేయాల్సిన పనులను వదిలేసి, గొల్లపల్లి రిజర్వాయర్ ముందుకు తేవడంపై వంద రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతులు తెచ్చుకుంటామని తెలిపారు. ప్రజల తరపున, రైతాంగం తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు అప్రజాస్వామిక విధానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



