- కొత్తపల్లి రేణుక సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేట పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని,పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి బాలాజీ గ్రాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు.సోమవారం పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిర్వహిస్తుండగా, ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు, ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను నేటి వరకు పూర్తి చేయలేదని, పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఏ బజారులో చూసినా ఏ వాడలో చూసినా డ్రిల్లింగ్ మిషన్ గుంతలు, నాళాల(మ్యాన్ హోల్స్) కోసం తవ్విన పెద్ద పెద్ద గోతులతో ప్రజలకు రవాణా ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. అతుకుల గతుకుల రోడ్లమీద అనేక సందర్భాలలో ప్రయాణికులు కాళ్లు చేతులు విరగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు.దుమ్ము ధూళితో అనారోగ్యం పాలయ్యి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు అనేకమంది ఉన్నారని ఆవేదన చెందారు.ఈ పనులను స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పట్టించకపోవడం సిగ్గుచేటు అన్నారు.కాసులకు కక్కుర్తి పడ్డ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ కి కలిసి వస్తున్న అంశం అన్నారు. కాబట్టి మున్సిపల్ చైర్మన్, అధికార పార్టీ నాయకులు, పబ్లిక్ హెల్త్ డి.ఈ దృష్టి పెట్టి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పనుల పట్ల నిర్లక్ష్య పూరిత వైఖరి అవలంబిస్తున్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేని యెడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న సందర్భంలో పట్టణ పోలీసులు బ్యానర్‌ను చించి వేస్తూ, నాయకులందరిని అరెస్ట్ చేశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక,సహాయ కార్యదర్శి సంతోషిమాత, కోశాధికారి జయమ్మ, టి యుసిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు కర్ణాకర్, పార్టీ నాయకులు శేషగిరి, మోహన్,నారాయణ, బిక్షం, పిఓడబ్ల్యు జిల్లా నాయకులు పద్మ, లక్ష్మీ, పావని, అనసూయ, రేణుక, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.




