– పురుషుల్లో 5.2 శాతం.. మహిళల్లో ఐదు శాతం
– శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్య రేటు తక్కువే
– తొలిసారిగా నెలవారీ పీఎల్‌ఎఫ్‌ఎస్ డేటా విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. కేంద్రంలో మోడీ సర్కారు విధానాలతో ప్రజలు ఈ నిరుద్యోగ రక్కసికి తీవ్రంగా బలవుతున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. కానీ, నిరుద్యోగ మహమ్మారిని రూపుమాపే విష యంలో మాత్రం మోడీ సర్కారు విఫలమవుతూనే ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు ఐదు శాతానికిపైనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించి కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మొదటిసారి నెలవారీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్)ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ లేబర్ ఫోర్స్ సర్వేను త్రైమాసిక, వార్షిక ప్రాతిపాదికన విడుదల చేసేవారు. కరెంట్ వీక్లీ స్టేటస్ (సీడబ్ల్యూఎస్)లో సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్ని వయసులవారిలో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా ఉన్నది. పురుషులలో నిరుద్యోగ రేటు 5.2 శాతంగా, మహిళల్లో ఐదు శాతంగా ఉన్నది. దేశవ్యాప్తంగా 15-29 ఏండ్ల వయసువారిలో నిరుద్యోగం 13.8 శాతంగా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో 17.2 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 12.3 శాతంగా ఉన్నది. ఇక ఇదే ఏజ్ గ్రూపు మహిళల్లో నిరుద్యోగ రేటు 14.4 శాతంగా ఉన్నది. నగరాల్లో అత్యధికంగా 23.7 శాతంగా, గ్రామాల్లో 10.7 శాతంగా నమోదైంది. ఇక ఇదే ఏజ్ గ్రూపు పురుషుల విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 13.6 శాతంగా ఉన్నది. ఇది నగరాల్లో అత్యధికంగా 15 శాతమైతే.. గ్రామాల్లో 13 శాతంగా నమోదైంది.
మహిళల ఎల్‌ఎఫ్‌పీఆర్ 38 శాతమే..!
దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) 55.6 శాతంగా ఉన్నది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50.7 శాతంగా నమోదైంది. ఇక ఎల్‌ఎఫ్‌పీఆర్‌కు సంబంధించి పురుషుల విషయానికొస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 79 శాతంగా, పట్టణాల్లో 75.3 శాతంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఎల్‌ఎఫ్‌పీఆర్ తక్కువగా నమోదైంది. ఇది 38.2 శాతంగానే ఉన్నది. శ్రామికశక్తిలో వ్యక్తుల శాతం(పని చేస్తున్నవారు, పనిని కోరుతున్నవారు)ను ఎల్‌ఎఫ్‌పీఆర్ సూచిస్తుంది. దీనిని బట్టి చూస్తే మహిళల భాగస్వామ్య రేటు తక్కువగా ఉండటం గమనార్హం.
సర్వేలో 3.80 లక్షల మంది కవర్
ఈ ప్రక్రియలో మొత్తం 7,511 మొదటి-దశ నమూనా యూనిట్లను సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 89,434 గృహాలను కవర్ చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 49,323, పట్టణ ప్రాంతాల నుంచి 40,111 ఇండ్లు ఉన్నాయి. 3,80,838 మంది వ్యక్తులను సర్వే చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 2,17,483 మంది, పట్టణ ప్రాంతాల నుంచి 1,63,355 మంది ఉన్నారు.
ఉపాధి పొందుతున్న మహిళల నిష్పత్తి తక్కువ
ఇక మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్నవారి నిష్పత్తిని వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) నిర్వచిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో డబ్ల్యూపీఆర్ ఏప్రిల్ నెలలో 55.4 శాతంగా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో 47.4 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా మాత్రం 52.8 శాతంగా ఉన్నది. మహిళల విషయానికొస్తే.. ఈ నిష్పత్తి తక్కువగా ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో 36.8 శాతం, పట్టణాల్లో 23.5 శాతంగా నమోదైంది. దేశస్థాయిలో ఒకే వయస్సు కలిగిన మొత్తం మహిళా డబ్ల్యూపీఆర్ 32.5 శాతంగా ఉన్నది.
ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1 శాతం
- Advertisement -
- Advertisement -