నవతెలంగాణ-హైదారాబాద్: లోక్ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. చిరాగ్‌ను చంపేస్తామంటూ … సోషల్ మీడియా వేదికగా దుండగులు పోస్టులు పెట్టారు. ఈ విషయాన్ని ఎల్‌జెపి ప్రతినిధి రాజేష్ భట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘టైగర్ మెరాజ్ ఇడిసి’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో హత్య బెదిరింపు పోస్టులు పెట్టారని రాజేష్ తెలిపారు. చిరాగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగానే ఈ బెదిరింపులు వచ్చాయన్నారు. ఈ బెదిరింపులపై పట్నాలోని సైబర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశామని, సంబంధిత వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని రాజేష్ భట్ తెలిపారు.
బెదిరింపు వెనక తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అభ్యర్థించినట్లు తెలిపారు. అయితే, ఆ ఇన్‌స్టా అకౌంట్ ఫేక్ అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కాగా.. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఇటీవల చిరాగ్ ప్రకటించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి కారణమైన బీహార్ ప్రజల కోసం పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే హత్యా బెదిరింపులచ్చాయి.