Friday, May 2, 2025
Homeరాష్ట్రీయంమే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు

– 8 గంటల పని, కార్మిక హక్కులను రక్షించుకుంటాం
– నాలుగు లేబర్‌ కోడ్స్‌ అమలైతే కార్మికవర్గం ఉనికే ప్రశ్నార్ధకం
– కనీస వేతనాల అమలుకు పోరాటం
– 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : మే డే సభల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

ప్రపంచ కార్మికుల దీక్ష దినం మే డే త్యాగనిరతి, పోరాట పటిమ, స్ఫూర్తితో ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పాశంమైలారంలోని కిర్బీ, పటాన్‌చెరులోని శాండ్విక్‌, సీబీఎల్‌ పరిశ్రమల్లో గురువారం నిర్వహించిన మే డే కార్యక్రమాల్లో జెండావిష్కరణ చేశారు. ఆయా కంపెనీల కార్మికులు బైక్‌ ర్యాలీగా సంగారెడ్డి సభా స్థలికి చేరుకున్నారు. అనంతరం స్థానిక ఐబీ సెంటర్‌లో నిర్వహించిన సభలో చుక్క రాములు మాట్లాడారు. 1886లో అమెరికాలోని చికాగోలో హే మార్కెట్‌ వద్ద పని దినాల తగ్గింపు, చట్టపరమైన సదుపాయాల కోసం పెద్దఎత్తున పోరాడితే అక్కడి ప్రభుత్వం కాల్పులు జరిపి ఆరుగురి ప్రాణం తీసిందని వివరించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన కార్మికుల సంఘటిత శక్తి వల్లే 8 గంటల పని విధానం చట్టబద్దమైందన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్స్‌గా మార్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే తిప్పిగొట్టగలమన్నారు. 8 గంటల పని విధానాన్ని కాపాడుకునేందుకు కార్మికులు పెద్దఎత్తున పోరాడాల్సిన అవసరమేర్పడిందన్నారు. లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి వస్తే కార్మికవర్గం ఉనికే ప్రశ్నార్ధకం అవుతందన్నారు. పర్మినెంట్‌ పద్ధతి లేకుండా చేసి కాంట్రాక్టు, వలస కార్మికులకు తక్కువ వేతనాలిచ్చి శ్రమ దోపిడీకి పాల్పడేందుకు లేబర్‌ కోడ్స్‌ దోహదపడతాయన్నారు. కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల కోట్లాది మంది కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. 12 గంటల పని విధానం తీసుకొచ్చి కార్పొరేట్‌ శక్తుల లాభాలు పెంచేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. మరోపక్క కార్మికుల్ని విభజించేందుకు మతం పేరుతో కుట్రలు చేస్తోందని విమర్శించారు.
కనీస వేతనాల సవరణ జీవోలను అమలు చేయాలని హైకోర్టు చెప్పినా నిర్లక్ష్యం చేయడం సరైందికాదన్నారు. కార్మికులకు రోజుకు రూ.178 వేతనం ఇస్తే సరిపోతుందని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పెరిగిన ధరలు, అవసరాలరీత్యా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మిక వర్గం తమ హక్కుల కోసం, చట్టాల రక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పెద్దఎత్తున పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో ఈనెల 20 కార్మిక సంఘాలు నిర్వహించే సార్వత్రిక సమ్మె పోరాటాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా కోశాధికారి కె.రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, బాగారెడ్డి, సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి, నాయకులు ప్రసన్నరావు, సురేష్‌, బీంరెడ్డి, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img