Monday, May 19, 2025
Homeఎడిట్ పేజివిశ్వమానవ పతాక

విశ్వమానవ పతాక

- Advertisement -

జీవితాలను చరిత్రగా లిఖించి ప్రజల హృదయాల్లో పతాకాలై రెపరెపలాడే వారు కొందరుంటారు. తమ ఆలోచనలు, అవగాహనలు, ధృక్పథాలు, ఆచరణల వల్ల సమాజంలో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. వాళ్లు సాటి మనుషులను ప్రేమిస్తారు. మానవాళి శ్రేయస్సుకు బాధ్యత వహిస్తారు. దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి రహదారులను విప్లవీకరిస్తారు. వర్గపోరాటమనే చైతన్యాన్ని ప్రోది చేసి శ్రామికలోకం దోసిల్లు నింపుతారు. గాయాలపాలవుతున్న చెమట చుక్కలకు కమ్యూనిజాన్ని లేపనంగా పూస్తారు. వాళ్లనే మార్క్స్‌, ఏంగిల్స్‌, లెనిన్‌, చే, భగత్‌సింగ్‌, సుందరయ్యలని అంటారు. ఇలాంటి మహనీయులు చరిత్రలో బహు అరుదు. ఇప్పుడు సందర్భం సుందరయ్యది. నేడు ఆయన 40వ వర్ధంతి.
కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య… అవిశ్రాంత పోరాటయోధుడు. స్వాతంత్య్ర సమరాంగణంలో అతడొక సోషలిస్టు భావధార. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటానికి నేతృత్వమిచ్చిన ధీర. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఓ అజరామర గాథ.
”హయాత్‌ లేకె చలో కాయనాత్‌ లేకె చలో
చలో తో సారె జమానేకో సాథ్‌ లేకె చలో” అని కవి మఖ్దూం రాసినట్టుగా.. కాలాన్ని వెంటబెట్టుకు నడిచినవాడు.. జీవితం అణచివేతకు గురవుతున్నప్పుడు, హక్కులు నిరాకరించబడుతున్నప్పుడు ధిక్కారమే మార్గమని చూపినవాడు.. లొంగిపోతే జీవితం లేదని చాటినవాడు.. ఈ దేశంలో మార్క్సిజమనే నిజాన్ని పొత్తిళ్లకెత్తుకుని పెంచినవాడు.
నేడు నిజం అరుదైన విషయంగా మారిపోయింది. అబద్ధం అభివృద్ధి ముసుగేసుకుని ఆధునికతగా చలామణి అవుతోంది. సాంకేతిక ప్రగతి, డిజిటల్‌ విప్లవం, గ్లోబల్‌ మార్కెట్‌.. ఇలా అనేక రూపాల్లో పెట్టుబడి ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. సమాజం వేగంగా మారుతోంది. ఎంత వేగంగా అంటే.. చూసిన ప్రతిసారీ కొత్తగా కనిపించేంత! కవినీ, కళాకారుడినీ, సంపాదకుణ్ణి, సంగీత విద్వాంసుణ్ణి, సాంకేతిక నిపుణుడినీ, చివరికి శాస్త్రవేత్తను సైతం ఈ పెట్టుబడి ఓ రోజుకూలీగా, కేవలం నెలజీతగాడిగా మార్చేసింది. సమస్త సృజనలనూ సరుకుగా సంతలో పెట్టింది. మరోవైపు అస్థిత్వ వాదాలు, మతరాజకీయాలు, మూక సంస్కృతి, మనువాద భావజాలంలో మనిషి తనను తాను కోల్పోయి మరబొమ్మగా మారుతున్నాడు. రాజకీయాలు కార్పొరేట్ల కట్టుబానిసలుగా దిగజారిపోయాయి. ఈ నేపథ్యంలో సుందరయ్య జీవితం మనకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. ఆయన ఆలోచన, ఆచరణ మనకో అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
సుందరయ్య.. అంతర్జాతీయవాదానికి జాతీయస్ఫూర్తి. నేడు, ప్రపంచీకరణ పేరుతో జరిగే ఆర్థిక వలసవాదం దేశాన్ని కబళిస్తున్న వేళ.. సుందరయ్య లాంటి నేతల అవసరం మరింత స్పష్టమవుతోంది. బహుళజాతి కంపెనీలు రైతుల భూములను ఆక్రమిస్తున్నప్పుడు, విదేశీ పెట్టుబడులు కార్మిక శక్తిని చెరబడుతున్నప్పుడు, ఆర్థిక శాసనాల పేరిట మానవ హక్కులు తుడిచిపెడుతున్నప్పుడు.. సుందరయ్య జీవితం మనకు ఎనలేని బలమిస్తుంది. ఎదురుతిరిగే తెగువనిస్తుంది. ఈ రోజు ప్రపంచీకరణలో నలిగిపోతున్న స్థానిక జీవన విధానాలకు, మతోన్మాదంలో మగ్గిపోతున్న సామాజిక చైతన్యానికి సుందరయ్య దారిచూపుతాడు. నూతన జవసత్వాలనిస్తాడు. ఓ ప్రత్యామ్నాయ విప్లవ శాస్త్రంగా స్ఫూర్తినిస్తాడు. సత్యం కోసం జీవీతాన్ని ధారపోసిన విశ్వమానవ పతాకమతడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -