విద్యాశాఖను క్రమంగా తగ్గించి వేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విశ్వవిద్యాలయాల మీద దాడికి దిగాడు. హార్వర్డ్, కొలంబియాతో సహా ఏడు ప్రఖ్యాత సంస్థలకు వందల కోట్ల డాలర్ల మేర నిధుల కోతను ప్రకటించాడు. ఇంకా అనేక విద్యా కేంద్రాల జాబితాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఈ చర్యను ప్రతిఘటిస్తామని హార్వర్డ్‌తో సహా అనేక సంస్థలు స్పష్టం చేశాయి. ప్రపంచ పోటీతత్వంలో అమెరికాకు ఎదురులేకుండా చేయటంలో సోపానాలు, ఉత్ప్రేరకాలుగా ఉన్న విద్యాసంస్థల మీద వేటు అంటే తాను కూర్చున్న చెట్టుకొమ్మనే నరికే మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. అనేక విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలను ఆలంబనగా చేసుకొని బోస్టన్, ఆస్టిన్, సిలికాన్ వాలీ వంటి అనేక ప్రాంతాలు కొన్ని పరిశ్రమలు,సేవారంగాల్లో ఉపాధికి మారు పేరుగా నిలిచాయన్నది జగమెరిగిన సత్యం. అయితే ఆ ఫలితాలను కార్పొరేట్ సంస్థలే ఎక్కువగా సొమ్ము చేసుకున్నాయన్నది వేరే అంశం. పరిశోధనా రంగ అభివృద్ధికి అమెరికాలో కొన్ని ప్రయివేటు సంస్థలుగా పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నప్పటికీ రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నది. ఇప్పుడు ట్రంప్ వాటికి ఎసరు పెట్టాడు.అమెరికాను మరోసారి గొప్పదానిగా మారుస్తానని చెబుతున్న ట్రంప్‌కు మేథావుల నవకల్పనలు లేకుండా అది జరిగేది కాదన్న కనీస జ్ఞానం లేదు. వినాశనానికి కారణమైన అణుబాంబు, ఇతర మారణా యుధాలతో పాటు, మానవ కల్యాణానికి రూపకల్పన చేసిన వైద్య పరికరాలు, ఔషధాలు, బయోటెక్నాలజి వంటి ఇతర వాటిని రూపొందించింది కూడా పరిశోధకులే. మేథోశక్తి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే శక్తులను బట్టి అది దేనికి ఉపయోగపడుతుందన్నది చూడాలి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో శాస్త్రవేత్తలను మారణాయుధాల తయారీకి అమెరికా పాలకవర్గం పెద్ద ఎత్తున సమీకరించింది. తర్వాత సోవియట్ ప్రయోగించిన స్పుత్నిక్‌ను చూసిన తర్వాత పోటీగా పెద్ద ఎత్తున పరిశోధనకు నిధులు కేటాయిం చింది. ఇప్పుడు సాంకేతిక రంగంలో చైనా విసురుతున్న సవాలు గురించి ఒక వైపు ఆందోళన వెల్లడిస్తూనే పరిశోధనలను నిరుత్సాహపరిచే పిచ్చిపనిలా కనిపిస్తున్నప్పటికీ ట్రంప్ విద్యా రంగంపై ఎందుకు చేస్తున్నాడన్నది ఆసక్తి కలిగించే అంశం.
గాజాలో ఇజ్రాయిల్ జరుపుతున్న మారణకాండకు వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో అనేక విశ్వవిద్యాలయాల విద్యార్ధులు,బోధనా సిబ్బంది, పరిశోధకులు గళమెత్తారు. వాటికి నాయకత్వం వహించిన వారిలో విదేశాల నుంచి వచ్చి గ్రీన్ కార్డు పొందిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి మీద 1950దశకం నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాల్లోని సెక్షన్ల కింద అరెస్టులు, దేశబహిష్కరణకు ట్రంప్ పూనుకున్నాడు. బాధితులుగా ఉన్న పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించటం అంటే యూదులను, అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకించటంగా చిత్రిస్తున్నాడు. విదేశాల నుంచి వచ్చి చదువుకొనే వారు అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్నాడు. ఇప్పుడు స్వదేశీయులు మీద కూడా దాడిని ఎక్కుపెట్టాడు.ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఉండి ఆర్థికంగా పెద్ద ఉత్పాదక కేంద్రాలుగా ఉన్న 44 కౌంటీలలో(మన జిల్లాల వంటివి) 40 చోట్ల ట్రంప్ మీద పోటీ చేసిన కమలాహారిస్‌కు మెజారిటీ వచ్చింది. దేశం మొత్తం మీద వచ్చిన ఓట్లలో 40శాతం వచ్చాయి, అదే ట్రంప్‌కు ఐదు చోట్ల మెజారిటీ రాగా ఓట్లు వచ్చింది కేవలం ఐదుశాతమే. ప్రతి చోటా ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయం లేదా పరిశోధనా సంస్థ ఉంది.ట్రంప్‌కు ఆగ్రహం కలగటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. తనకు ఓటు వేయనందుకు తీర్చుకొనే కక్ష యావత్ దేశానికి నష్టమని గ్రహించటం లేదు. అమెరికాలో 3,100 జిల్లాలు ఉండగా వాటిలో వంద చోట్ల అత్యధిక ఆర్థిక ఉత్పత్తి జరుగుతోంది.ముందే చెప్పినట్లు ఏదో ఒక ప్రధాన విద్యాకేంద్రం ఉన్న 44 జిల్లాలు దేశంలో 1.5శాతమే అయినప్పటికీ జాతీయ ఉత్పత్తిలో 35శాతం అందిస్తున్నాయి. అమెరికాలో డెమో క్రాట్లు, రిపబ్లికన్లు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రఖ్యాత విద్యాసంస్థలు అనేక ఉద్యమాలకు పుట్టినిళ్లుగా మారు తున్నాయి.పాలకుల విధానాలను ఎండగట్టే మేథో కేంద్రాలుగా ఉన్నాయి.మన ఢిల్లీ జెఎన్‌యు వామపక్ష భావజాలం కేంద్రంగా ఉన్నట్లుగానే అమెరికాలో ప్రతి ఉన్నత విద్యాసంస్థలో అలాంటి వాతావారణమే ఉంటోందని, చైనా మద్దతు పొందుతు న్నారంటూ నిత్యం మితవాద శక్తులు దాడి చేస్తుంటాయి. వాటికి పెద్దన్నగా ఉన్న ట్రంప్ అలాంటి విద్యా కేం ద్రాలను దెబ్బతీయటం వెనుక భావజాల కోణం కూడా ఉంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని తెలిసినప్పటికీ ఇలాంటి బాపతు పుడుతూ, గిడుతూనే ఉంటారు.