– హార్దిక్ సేనకు వరుసగా ఐదో విజయం
– నిప్పులు చెరిగిన పేస్ ద్వయం బుమ్రా, బౌల్ట్
– సూపర్‌జెయింట్స్‌పై 54 పరుగులతో గెలుపు
ఐదు మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించిన ముంబయి ఇండియన్స్ ఇప్పుడు ఐదు మ్యాచుల్లో ఐదు విజయాలతో దూసుకెళ్తోంది. వాంఖడెలో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ముంబయి ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ లీగ్ దశలో సూపర్‌జెయింట్స్‌పై ముంబయి ఇండియన్స్‌కు ఇదే తొలి విజయం కావటం విశేషం. ఓవరాల్‌గా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ రెండో స్థానానికి ఎగబాకింది.
నవతెలంగాణ-ముంబయి
లీగ్ దశలో లక్నో సూపర్ జెయింట్స్ గండాన్ని ముంబయి ఇండియన్స్ ఎట్టకేలకు అధిగమించింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు లీగ్ దశలో ఆరు సార్లు తలపడిన ముంబయి ఇండియన్స్ ఏ మ్యాచ్‌లోనూ గెలుపు గీత దాటలేదు. బ్యాట్‌తో, బంతితో భీకర ఫామ్‌లో ఉన్న హార్దిక్‌సేన ఆదివారం వాంఖడెలో సూపర్‌జెయింట్స్‌కు షాక్ ఇచ్చింది. విజయంపై కన్నేసి ముంబయికి వచ్చిన లక్నో భారీ పరాజయం మూటగట్టుకుంది. 216 పరుగుల ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (34, 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (27, 15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఆయుశ్ బదాని (35, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ మిల్లర్ (24, 16 బంతుల్లో 3 ఫోర్లు) మెరిసినా.. ఆ జట్టుకు 54 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ముంబయి పేసర్లు జశ్‌ప్రీత్ బుమ్రా (4/22), ట్రెంట్ బౌల్ట్ (3/20), స్పిన్నర్ విల్ జాక్స్ (2/18) తొమ్మిది వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రియాన్ రికెల్టన్ (58, 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (54, 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కగా.. నమన్ ధిర్ (25 నాటౌట్, 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కార్బిన్ బాచ్ (20, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన విల్ జాక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అగ్రశ్రేణి పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా మరో ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా లసిత్ మలింగ (170) రికార్డును అధిగమించిన బుమ్రా 174 వికెట్లతో ముందంజ వేశాడు.
పేస్ త్రయం నిప్పులు
లక్నో సూపర్‌జెయింట్స్‌ను ముంబయి ఇండియన్స్ పేస్ త్రయం విలవిల్లాడించింది. జశ్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కార్బిన్ బాచ్‌లు సూపర్‌జెయింట్స్ బ్యాటర్లకు ముకుతాడు వేశారు. బౌల్ట్, బుమ్రా, బాచ్ త్రయం 12 ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి.. కేవలం 68 పరుగులే ఇచ్చింది. ఇక్కడే మ్యాచ్ ముంబయి ఇండియన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. స్పిన్నర్ విల్ జాక్స్ (2/18) సైతం వికెట్ల వేటలో జత కలవటంతో సూపర్‌జెయింట్స్ చేష్టలుడిగింది. 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. భారీ ఛేదనలో సూపర్‌జెయింట్స్ ఆరంభంలో రేసులోనే నిలిచింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (34), నికోలస్ పూరన్ (27) దూకుడుగా ఆడారు. ఓపెనర్ ఎడెన్ మార్‌క్రామ్ (9) నిరాశపరిచినా.. పవర్‌ప్లేలో సూపర్‌జెయింట్స్ 60/1 పరుగులు చేసింది. కానీ మిడిల్ ఆర్డర్‌లో కీలక బ్యాటర్లు తేలిపోయారు. కెప్టెన్ రిషబ్ పంత్ (4) వైఫల్య వ్యథను కొనసాగించగా..అబ్దుల్ సమద్ (2), డెవిడ్ మిల్లర్ (24), ఆయుశ్ బదాని (35) అంచనాలను తగినట్టు ఆడలేకపోయారు. బుమ్రా, బౌల్ట్ పేస్ నిప్పులు కక్కారు. ఈ ఇద్దరు 48 బంతుల్లో 42 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టారు. దీంతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ముంబయి ఇండియన్స్ లీగ్ దశలో తొలిసారి పైచేయి సాధించింది.
రికెల్టన్, సూర్య మెరుపుల్
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 215 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్య (5), రోహిత్ శర్మ (12) నిరాశపరిచినా.. ఓపెనర్ రియాన్ రికెల్టన్ (58), సూర్యకుమార్ యాదవ్ (54) ధనాధన్ అర్థ సెంచరీలతో మెప్పించారు. రికెల్టన్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదగా.. సూర్యకుమార్ యాదవ్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు మెరువగా ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఆఖర్లో నమన్ ధిర్ (25 నాటౌట్), కార్బిన్ బాచ్ (20) సైతం ధనాధన్ ముగింపుతో అలరించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టినా.. పరుగుల నియంత్రణలో అందరూ విఫలమయ్యారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : 215/7 (రియాన్ రికెల్టన్ 58, సూర్యకుమార్ యాదవ్ 54, మయాంక్ యాదవ్ 2/40, అవేశ్ ఖాన్ 2/42)
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్ : 161/10 (ఆయుశ్ బదాని 35, మిచెల్ మార్ష్ 34, జశ్‌ప్రీత్ బుమ్రా 4/22, ట్రెంట్ బౌల్ట్ 3/20, విల్ జాక్స్ 2/18)
ఎదురులేని ముంబయి
- Advertisement -