Monday, July 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅక్కరకురాని మిక్సోపతి

అక్కరకురాని మిక్సోపతి

- Advertisement -

– అల్లోపతి-ఆయుష్‌ కోర్సులు కలిపి ఇంటిగ్రేటెడ్‌ కోర్సు
– ప్రజారోగ్యంతో కేంద్రం చెలగాటం
– ఈ ఏడాది నుంచి మరికొన్ని కళాశాలలకు అనుమతి?
– విస్తరణ కోసం మోడీ సర్కార్‌ యోచనొ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైద్యులు

తిక్కలోడు తిరునాలకు వెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట! కేంద్రంలోని మోడీ సర్కార్‌ తీసుకుంటున్న కొన్ని అసంబద్ధ నిర్ణయాలు కూడా ఇలాగే ఉన్నాయి. నక్షత్ర మండలాన్ని మా రుషులే కనిపెట్టారని ఆ మధ్య ఓ కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. గో మూత్రం సర్వరోగ నివారిణి అంటూ మరో కేంద్రమంత్రి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పూర్వకాలంలోనే పుష్పక విమానాలు ఉన్నాయంటూ ఇంకో కేంద్రమంత్రి వ్యాఖ్యానం చేస్తే, అసలు విశ్వాన్ని సృష్టించిందే మనం అని మరో బీజేపీ పెద్దమనిషి తీర్మానం చేసేశారు. ఇలాంటి తలాతోకలేని మాటలకు శాస్త్రీయతను ఆపాదించి, ధృవీకరించుకోవాలనే తపనతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వైద్యరంగాన్ని ఆశ్రయించింది.
కె. ప్రియకుమార్‌
ఆయుర్వేదాన్ని, అల్లోపతిని కలిసేసి ‘మిక్సోపతి’ అంటూ మరో కొత్త ఆవిష్కరణకు తెరలేపింది. 2019 జాతీయ విద్యావిధానం ద్వారా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీనికి అంకురార్పణ చేసింది. ఆయుర్వేద చరక సంహితను, అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ ఆవిష్కరించిన పెన్సిలిన్‌ను ఒకే గాటన కట్టేసి, వైద్యరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని స్వయంగా ఆనాటి కేంద్రమంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ పుదుచ్చేరిలోని ‘జిప్‌మర్‌’ పర్యటన సందర్భంగా చెప్పారు. కొత్త ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (ఎమ్‌బీబీఎస్‌-బీఏఎమ్‌ఎస్‌) ప్రణాళికను ప్రకటించారు. దీనిని అప్పట్లోనే ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఐఎమ్‌ఏ)తో పాటు ఆయుర్వేద వైద్యులు కూడా వ్యతిరేకిం చారు. ఈ రెండూ పరస్పర భిన్నమైన వైద్య విధానాలనీ, రెంటినీ మిక్స్‌ చేయడం సరికాదని స్పష్టం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెస్తోంది.
ఆయుష్‌ కోర్సులన్నీ అల్లోపతికి అనుసంధానం
ఆయుష్‌ విభాగం పరిధిలో ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, హోమియోపతి వంటి పలురకాల సంప్రదాయ వైద్యాలన్నింటినీ, అల్లోపతితో మిక్స్‌ చేసి సరికొత్త వైద్య విధానాన్ని రూపొందించాలని యోచిస్తోంది. అల్లోపతి వైద్యంలోని ప్రోటోకాల్స్‌కూ, ఆయుష్‌ పరిధిలోని సంప్రదాయ వైద్య విధానాలకు ఏమాత్రం పొంతనే లేదు. కేంద్రం తొలిదశలో ఆయుర్వేదం-అల్లోపతిని కలిపి ‘మిక్సోపతి’ పేరుతో కొత్త కోర్సును రూపొందించింది.

ఆయుష్‌ వైద్యులు ‘నీట్‌’కు అర్హులే
పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎమ్‌డీ) ఇన్‌ సర్జరీ వంటి కోర్సుల్లోకి ఆయుర్వేద లేదా హౌమియోపతి ప్రాక్టీషనర్లకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. హౌమియోపతి వైద్యులు అల్లోపతిలో ఆరు నెలల కోర్సు పూర్తి చేసి, ఆ తర్వాత నీట్‌ పరీక్షలకు హాజరు కావచ్చు. వీరిని కూడా ఎమ్‌బీబీఎస్‌ విద్యార్థులతో సమానంగా ట్రీట్‌ చేస్తారు. 2030 నాటికి ఇంటిగ్రెటెడ్‌ డాక్టర్లను క్రియేట్‌ చేయాలనేది కేంద్రం లక్ష్యం. అయితే దీనివల్ల మోడరన్‌ మెడిసిన్‌ బేసిక్స్‌ నేర్చుకున్న స్వచ్ఛమైన ఎమ్‌బీబీఎస్‌ వైద్యులు ఇకపై ఉండబోరనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

విలీనం అసాధ్యం
సాంప్రదాయ మరియు ఆధునిక వైద్యం కలిసి జీవించగలవు కానీ, వాటిని విలీనం చేయలేరని అల్లోపతి, ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. ఆయుర్వేదం, అల్లోపతి చికిత్సలను కలపడం వల్ల ప్రమాదకరమైన ఔషధ పరస్పర భిన్న చర్యలు జరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికల్ని వైద్యులు చేస్తున్నారు.
జిప్‌మర్‌లో…
పాండిచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌)లో ప్రయోగాత్మకంగా ఈ కోర్సును అమల్లోకి తెచ్చారు. అక్కడి విద్యార్థులకు ఈ సిలబస్‌ గందరగోళాన్ని కలిగిస్తోంది. తాము ఏ తరహా వైద్యాన్ని నేర్చుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు. భారతదేశ వైద్య విద్యా వ్యవస్థలో ‘మిక్సోపతి’ సరికొత్త వివాదానికి కారణమవుతోంది.
ఏ వైద్యం చేస్తారు?
ఆయుర్వేదం, హోమియోపతి వంటి సాంప్రదాయ వైద్య విధానాల్లో శస్త్ర చికిత్సలే లేవు. అల్లోపతిలో మాత్రమే శస్త్ర చికిత్సలు చేస్తారు. శస్త్ర చికిత్స చేశాక, పేషెంట్‌కు అల్లోపతి మందులు సిఫార్సు చేస్తారా లేక ఆయుర్వేదం, హోమియోపతి మందుల్ని ఇస్తారా అనే చర్చా జరుగుతున్నది. ప్రస్తుతం జిప్‌మర్‌లో మాత్రమే ఈ తరహా ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ నడుస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సంలో ఈ కోర్సును మరికొన్ని కళాశాలలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తున్నది! దీనికోసం కొత్త సిలబస్‌ను కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది. వాస్తవానికి న్యూరో సర్జరీ, జీర్ణాశయ శస్త్రచికిత్స, అనస్థీషియా వంటి 64 ఆధునిక శస్త్రచికిత్సా విధానాల నిర్వహణా అనుమతి బీడీఎస్‌ చేసే గ్రాడ్యుయేట్లకు కూడా ఉండదు. అలాంటిది బీఏఎమ్‌ఎస్‌ గ్రాడ్యుయేట్లను ఎలా అనుమతిస్తారని అల్లోపతి వైద్యులు ప్రశ్నిస్తున్నారు.
మిక్సోపతి ఎందుకు?
ఏ వైద్య అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘మిక్సోపతి’ని ప్రతిపాదిస్తుందో దానికి సహేతుకమైన కారణం లేదు. అల్లోపతి, ఆయుర్వేదం వైద్యాలు పూర్తిగా భిన్నమైనవి. దేశంలో డాక్టర్ల కొరత లేదు. ప్రభుత్వం నియామకాలు చేయకపోవడమే సమస్య. వాటిని ఆపేసి కృత్రిమ కొరత సృష్టించి, ఆ పేరుతో అర్థంపర్థంలేని కోర్సుల్ని ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటు న్నారు. ఏ కోర్సుకు ఆ కోర్సులను ప్రోత్సహిస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి
డాక్టర్‌ గార్గేయ, కన్వీనర్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఆరోగ్య విభాగం

హేతుబద్ధం కాదు
కేంద్రం తీసుకున్న మిక్సోపతి నిర్ణయం పూర్తి అశాస్త్రీయం. హేతుబద్ధతలేని నిర్ణయం. భారతదేశం స్వాతంత్య్రానంతరం వైద్యరంగంలో అనేక విజయాలు సాధించింది. మనిషి సగటు ఆయుష్షు పెరిగింది. వ్యాక్సిన్ల ద్వారా పలు అంటువ్యాధులు అంతమయ్యాయి. యాంటీ బయాటిక్స్‌ వల్ల అనేక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మిక్సోపతి అంటే ప్రజలు తమ చికిత్స కోసం ఇష్టమైన వైద్యవిధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛను హరించడమే. ఈ కోర్సు చదివిన వైద్యులు పేషెంట్లకు ఏ తరహా వైద్య సేవల్ని అందిస్తారు? వాటివల్ల దుష్పరిణామాలు సంభవిస్తే బాధ్యులు ఎవరు? కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.
– డాక్టర్‌ జె.ఐజాక్‌ న్యూటన్‌, అధ్యక్షులు, తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -