Friday, July 11, 2025
E-PAPER
Homeమానవిబహుళ వృత్తుల్లో నైపుణ్యం ఉపేంద్ర ప్ర‌త్య‌కం

బహుళ వృత్తుల్లో నైపుణ్యం ఉపేంద్ర ప్ర‌త్య‌కం

- Advertisement -

ఏక కాలంలో బహుళ వ్యాపకాలు(మల్టీ టాస్కింగ్‌) ఈ కాలపు లక్షణం. రోజంతా ఒకే ఉద్యోగం, ఒకే వృత్తి పాత పద్ధతి. ఒకే రోజున బహుళ వృత్తుల నిర్వహణ అనివార్యమైన అవసరం. ఉన్నస్థితి నుంచి మెరుగైన స్థితికి చేరుకోవాలంటే ఇది తప్పనిసరి. జీవన ప్రమాణాల పెంపుదలకు తమ లోపలి శక్తుల వినియోగాకి తోడ్పడే సృజనాత్మక విన్యాసమే ఈ మల్టీ టాస్కింగ్‌. నగరవాసులకే ఇది పరిమితం కాదు. నాలుగు రకాల డిగ్రీలున్న వాళ్ళకే కాదు. ఎవరైనా సరే బతుకును కాస్తంత హాయిగా గడపాలంటే బహుళ వృత్తుల నిర్వహణను పట్టుదలగా సాధన చేయాలి. ఈ సాధనతోనే ఊహించని నైపుణ్యాలు అలవరుచు కున్నారు గుండు ఉపేంద్ర. ప్రస్తుతం ఆమె ప్రొఫెషనల్‌ బ్యూటీషియన్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, హెయిర్‌ డ్రెస్సర్‌గా, కాస్మటాలజిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చు కున్నారు. ఒక చిన్న బ్యూటీ పార్లర్‌తో మొదలైన ఆమె ప్రస్థానం నేడు ఓ బొటిక్‌ నడిపే స్థాయికి ఎలా చేరుకుందాం తెలుసుకుందాం…

ఉపేంద్రను అందరూ ఉమక్కా అని అభిమానంగా పిలుచుకుంటారు. ఈమె సొంత ఊరు నల్గొండ జిల్లా, తుక్కాపురం. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌. చదివింది ఇంటర్‌. పదిహేడేండ్లకే పెండ్లి చేశారు. అత్తగారిది వలిగొండ. పెండ్లి తర్వాత ఇంటి పనులకే పరిమితం కాలేదు. ఉలెన్‌ అల్లికలు చేసి ఇంటిని తీర్చిదిద్దుకునేవారు. ఇంతలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అవే ఈమెను ఫ్యాషన్‌ డిజైనర్‌గా మార్చివేశాయి. తన భర్తకు చేతనైన సహాయం చేయాలని సంకల్పించింది. కాని కొందరి సూటిపోటి మాటలు. ‘చదువు తక్కువ, తెలివిలేదు. నువ్వేం చేయగలవు. నీకేం చేతనవుతుంది’ అనే మాటలు సూదుల్లా గుచ్చు కున్నాయి. ఆ మాటలను ఆమె లెక్క చేయలేదు. ఏలాగైనా ఏదో ఒకటి చేసితీరాలనే ఆమె కృషి, పట్టుదలే ఆమెను ఉన్నత స్థితికి చేర్చాయి.
అన్న, భర్త ప్రోత్సాహంతో…
చెల్లి కుటుంబ సమస్యలు చూసి అన్న తిరిగి హైదరాబాద్‌ తీసుకువచ్చి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు నేర్చుకునేందుకు చేర్పించాడు. దీనికి భర్త ప్రోత్సాహం కూడా దండిగా లభించింది. ఫ్యాషన్‌ డిజై నింగ్‌లో అప్పటి నుండి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ సాగుతూనే ఉంది. మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. కుటుంబంలో, చుట్టుపక్కల వారిలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఫ్యాషన్‌ డిజైన్‌లో ఆసక్తి ఉండి నేర్చుకోవాలనుకునే తన లాంటి మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తానంటున్నారు ఉపేంద్ర.
ఇలా ప్రారంభమయ్యింది
ఆమె పదవ తరగతి వేసవి సెలవుల్లో రెండు నెలలు సరదాగా నేర్చుకున్న ఎంబ్రయిడరీ, కుట్టు పనే తర్వాత కాలంలో ఆమెకు ఆసరా అయ్యాయి. కుట్టులో ప్రవేశం ఉంది. కాబట్టి అన్నయ్య ఇదైతే బాగుం టుందని సలహా ఇచ్చాడు. ఒక సంస్థలో ఫ్యాషన్‌ డిజైనర్‌గా ట్రైనింగ్‌ కోసం చేర్పించాడు. అప్పట్లో ఉపేంద్రకు ఇష్టం లేకపోయినా తన కాళ్ళపై తాను నిలబడాలనే సంకల్పంతో చేరింది. ఆరు నెలల శిక్షణలో అన్నీ నేర్చుకుంది. ఎంబ్రయిడరీ, పెయింటింగ్‌, కలర్‌ లాంగ్వేజ్‌, షేడ్స్‌, రకరకాల డ్రెస్సులు, బ్లౌజ్‌లు, ఫ్రాక్స్‌ కుట్టడంతో పాటు కలర్‌ కాంబినేషన్‌పై మంచి అవగాహన వచ్చింది. నేర్చుకున్న సంస్థ ఆధ్వర్యంలోనే ఉద్యోగం సంపాదించింది.
మల్టీ టాస్కింగ్‌ ఎలా సాధ్యమైందంటే..?
ఫ్యాషన్‌ డిజైనర్‌ అంటే ఏదో ఒకటి రెండింటిలో మాత్రమే ఎక్కువ మందికి ప్రావీణ్యం ఉంటుంది. కానీ ఉపేంద్ర చిన్నప్పటి నుండి అందాలకు మెరుగులు దిద్దడంలో నైపుణ్యం చూపేవారు. దాంతో తెలిసిన వారు బ్యూటీషన్‌ కోర్సు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. అలాగే హ్యాండ్‌ ఎంబ్రయిడరీతో పాటు, మిషిన్‌ ఎంబ్రయిడరీ, కుట్లు, అల్లికలు ఎంతో ఆసక్తితో చేస్తున్న ఈమెను సాఫ్ట్‌టాయిస్‌ తయారు చేయడంలో శిక్షణ తీసుకోమని స్నేహితులు సలహా ఇచ్చారు. వెరసి దాదాపు ఫ్యాషన్‌ డిజైనింగ్‌కి సంబంధించిన అన్నింట్లో ప్రావీణ్యం సంపాదించారు. బ్యూటీషన్‌గా 40 రకాల జడలు వేస్తారు. 10 రకాల హెయిర్‌ కట్‌లు, ఐబ్రోస్‌ చేయడంలో ఆమెకు రాంనగర్‌ ప్రాంతంలో సిద్ధ హస్తురాలనే పేరు ఉంది. డిజైన్‌ బ్లౌజ్‌లు, డిజైనర్‌ డ్రెస్సులు ఎంతో అందంగా కుడతారు. చీరలకు హాండ్‌ ఎంబ్రయిడరీ 55 రకాలు, జిగ్‌జ్యాంగ్‌(మిషన్‌ ఎంబ్రయిడరీ) 26 రకాలు, టాయిస్‌ 13 రకాలు చేయగలరు. అలాగే మెహందీ డిజైన్‌లు పెట్టగలరు. పెండిండ్లకు, ఫంక్షన్లకు మేకప్‌ చేస్తారు. ఒక ముషిని చూడగానే తనకు ఎలాంటి బట్టలు నప్పుతాయో ఇట్టే చెప్పగలరు.
సొంతంగా షాప్‌
ఒకప్పుడు ఆమె బంజారా హిల్స్‌లో బ్యూటీషియన్‌గా, సెట్విన్‌లో జిగ్‌జ్యాంగ్‌, సాఫ్ట్‌టాయిస్‌, కూకట్‌పల్లిలో విద్యార్థులకు కుట్టులో ట్రైనింగ్‌ ఇచ్చేవారు. ఆమె ఆర్థిక అవసరం అలాంటిది. మొదట్లో ట్రైనింగ్‌ క్లాసులు తీసుకోవటానికి వెళ్ళినపడు ఈమెను చూసి అందరూ వెక్కిరించారు. ఇంత చిన్నగా ఉన్న అమ్మాయి మాకేం నేర్పుతుందన్నారు. కానీ ఆమె క్లాసులు తీసుకొని, ట్రైనింగ్‌ ఇచ్చిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఆమెనెంతో అభినందించారు. నైపుణ్యాలు పెరిగే కొద్ది పనితో పాటు తిరగడం కూడా బాగా ఎక్కువయ్యింది. దాంతో భర్త తన టాలెంట్‌ను గుర్తించి సొంతగా షాప్‌ పెట్టుకొమ్మని సలహా ఇచ్చారు. ముందు కాస్త భయపడ్డారు. షాప్‌కు పెట్టుబడి పెట్టేటపుడు చాలా మంది నష్టపోతారని భయపెట్టారు. కానీ ఆ మాటలకు భయపడలేదు. ఆడుగు ముందుకే వేశారు. రాంనగర్‌లో చిన్న షాపు అద్దెకు తీసుకొని వ్యాపారం ప్రారంభించారు. అలాంటి ఆమె ఈరోజు పట్టుదలతో ఒక స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం రాంనగర్‌లోని ఆమె షాప్‌ బాగా అభివృద్ధి చెందింది. కష్టమర్లు ఆమె వద్దకు ముందు అపాయింట్‌మెంట్‌ తీసుకుని వస్తారు. చాలా మంది ఆమె సమయం కోసం ఎదురు చూస్తుంటారు.
అప్యాయంగా పలకరిస్తారు
ఉపేంద్ర ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తారు. ఇంటిపని, వంటపని పూర్తి చేసి పిల్లలను స్కూల్‌కి పంపించేసి తన బొటిక్‌ పనుల్లోకి దిగుతారు. ఉదయం అంతా కుట్టు, అల్లికలు చూసుకుం టారు. పది గంటలకు సెట్విన్‌లో ట్రైనింగ్‌ క్లాసులకు వెళతారు. తిరిగి సాయంత్రం బ్యూటీపార్లర్‌ బిజీగా ఉంటుంది. కష్టమర్లు వస్తూ ఉంటారు. సూమారు 10గం|| వరకు షాప్‌ తెరచి ఉంచుతారు. మంచి సీజన్‌లోనైతే 11:30గం|| వరకు పార్లర్‌లో పని ఉంటుంది. ఇంటి పనుల్లో భర్త ఆమెకు సహకారిస్తారు. ప్రస్తుతం షాప్‌ బాగా నడుస్తుంది. తన కాళ్లపై తాను బతకగలుగుతున్నందుకు గర్వ పడుతున్నారు. ప్రస్తుతం ఈమె షాప్‌కు బ్యూటీపార్లర్‌గా, బొటిక్‌గా మంచి పేరుంది. దాదాపు 250 మంది షాప్‌కు రెగ్యులర్‌గా వస్తుంటారు. దాంతో మరో చోట పెద్ద స్థలంలో మరో షాప్‌ పెట్టుకున్నారు. షాప్‌కు వచ్చే ప్రతీ మహిళను చెల్లి, అక్కా అంటూ స్నేహభావంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా వచ్చిన వారికి నవ్వుతూ సమాధానం చెబుతారు.
ఉచిత ట్రైనింగ్‌ ఇస్తాను
మనం ఎందులో రాణించాలన్నా కృషి, ప్రోత్సాహం ఎంతో అవసరం. అవి తనకు ఉండటంతో ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఏ కుటుంబంలోనైనా కొన్ని సమస్యలు, అందులో ఆర్థిక సమస్యలు సహజం. కానీ సమస్య ఎదురైనపుడు నేను మహిళను, నేనేం చేయగలను అని చేతులు కట్టుకొని కూర్చుంటే వారు ఎప్పటికైనా చేతగాని వారిగానే మిగిలిపోతారంటున్నారు ఉపేంద్ర. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. దానికి పని కల్పించినపుడే మన నైపుణ్యం బయట పడుతుంది. మనకూ ఒక జీవనోపాధి దొరుకుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ‘ఆసక్తి ఉండి నాలా ఈ రంగంలో రాణించాలనే మహిళలకు బ్యూటీషన్‌, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తాను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -