నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ క్రికెట్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. పాక్ యువ బ్యాట్స్‌మెన్, 24 ఏళ్ల హైదర్ అలీ లైంగిక ఆరోపణల కింద యూకేలో అరెస్టయ్యాడు. పాకిస్థాన్ ‘ఏ’ జట్టు అయిన పాకిస్థాన్ షాహీన్స్‌తో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆయనపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ ఘటనతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిపై తక్షణమే తాత్కాలిక సస్పెన్షన్ విధించింది.
వివరాల్లోకి వెళితే.. పాక్ షాహీన్స్ జట్టు జులై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకేలో పర్యటించింది. ఈ క్రమంలో ఆగస్టు 3న బెక్హెమ్ మైదానంలో మ్యాచ్ ఆడుతుండగా పోలీసులు హైదర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ మూలాలున్న ఒక యువతి చేసిన లైంగిక ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం హైదర్ అలీని బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు, తదుపరి విచారణకు సహకరించాలనే షరతుతో అతడి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పీసీబీ వెంటనే స్పందించింది. యూకే చట్టపరమైన ప్రక్రియలకు తాము పూర్తిగా సహకరిస్తామని, విచారణ పూర్తయ్యే వరకు హైదర్ అలీని సస్పెండ్ చేస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసులో హైదర్ అలీకి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని, దీనిపై యూకేలో తాము కూడా అంతర్గత విచారణ జరుపుతామని పీసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న సమయంలో హైదర్ అలీ తాను నిర్దోషినని చెబుతూ కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరున్న హైదర్ అలీ, పాకిస్థాన్ తరఫున రెండు వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడారు. పాక్ వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెసన్ ప్రణాళికల్లో ఉన్న అతడు, త్వరలో షార్జాలో జరగనున్న టీ20 ట్రై-సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ వివాదం అతడి కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. గతంలో 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ ఇంగ్లండ్‌లోనే అరెస్టయిన ఘటనను ఈ ఉదంతం మరోసారి గుర్తుచేసింది.