ఉదయం నుంచే క్యూలో రైతులు.. మండల కేంద్రాల్లో ధర్నాలు
నవతెలంగాణ- విలేకరులు
అదును దాటిపోతున్నా సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం.. వచ్చినా కొద్దిమందికే అందుతుండటం.. అధికారులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోడ్ వచ్చిందని తెలిసిన వెంటనే తెల్లవారేసరికే ఆయా కార్యాలయాల ఎదుట లైన్‌లో నిలుచుంటున్నారు. కొన్ని చోట్ల శనివారం ధర్నాలు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉదయం నుంచి గ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు లైన్‌లో నిలబడ్డారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు పలుచోట్ల రోడ్డుపై బైటాయించి ధర్నాలు చేశారు. రైతుల రాస్తారోకోతో గజ్వేల్ నుంచి తూప్రాన్, సంగారెడ్డి, రామాయంపేట వెళ్లే బస్సులు, వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సీఐ రవికుమార్ రంగంలో దిగి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమించాలని కోరారు. వ్యవసాయ అధికారులు సంఘాల స్థలానికి చేరుకొని యూరియా రాగానే పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై రైతులు మహాధర్నా నిర్వహించారు. వారికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం గజ్వేల్‌లో రైల్వే రేక్ పాయింట్ పునరుద్ధరించి రైతులకు యూరియా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతులు పాసు బుక్కులతో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద లైన్‌లో నిలబడ్డారన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూరియా కోసం రైతులు చేగుంట మండల కేంద్రంలో శ్రీ ఆంజనేయ రైతు సేవ కేంద్రం వద్ద లైన్ కట్టారు. రైతు సేవ కేంద్రానికి 200 బస్తాల యూరియా రావడంతో దాదాపు 400 మంది రైతులు ఉదయం నుంచే లైన్‌లో ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహబూబా బాద్ పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు, అధికారుల మధ్యన వాగ్వాదం జరిగింది. రైతులు ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం క్యూ కట్టారు. గోదాంలలో యూరియా లేదు. ఇప్పటికే సుమారు రెండు మూడు వందల మంది రైతులకు టోకెన్లు ఇచ్చి ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 400 బస్తాల యూరియా లారీ వచ్చింది. దాంతో రైతులు ఎగబడ్డారు. తోపులాట, ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడటంతో వ్యవసాయాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి రైతులను చెదరగొట్టారు. 400 బస్తాల యూరియా వస్తే.. రైతులు వెయ్యి మంది వరకు ఉన్నారు. అప్పటికే రెండు మూడు వందల మందికి టోకెన్లు ఇచ్చి ఉన్నారు. వచ్చిన 400 బస్తాలు ఏం చేయాలో అర్థం కాక గోదాంకు తాళం వేసి అధికారులు జారుకున్నారు. రైతులు సాయంత్రం వరకు గోదాము వద్ద పడిగాపులు కాశారు.
బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు గ్రోమోర్ షాపు ఎదుట లైన్‌లో నిలబడి ఉన్నారు. వర్షం రావడంతో చెప్పులు, గొడుగులు లైన్‌లో పెట్టారు. వారం రోజులుగా యూరియా దొరకడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసముద్రం మండల కేంద్రంలో పీఏసీఎస్ ధనసరి సహకార సంస్థ ముందు యూరియా కోసం రైతులు నిరీక్షించారు. ఒకటి రెండ్రోజుల్లో యూరియా వస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని పోలీసులు, వ్యవసాయ అధికారి నచ్చజెప్పారు. గూడూరు మండలంలోని సొసైటీ కార్యాలయం ముందు కూడా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులూ ఏర్పడకుండా గూడూరు సీఐ సూర్యప్రకాష్, ఎస్‌ఐ గిరిధర్‌రెడ్డి సొసైటీ వద్దకు చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.
‘యూరియా’ తిప్పలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES