నవతెలంగాణ-హైదరాబాద్: యెమెన్ వలసకేంద్రంపై అమెరికా దాడి అంతర్జాతీయ మానవతా చట్ట ఉల్లంఘనేనని ఆమ్నెస్టీ అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అమెరికాను కోరింది. హౌతీలపై దాడిలో భాగంగా, సాదాలోని అక్రమవలసదారుల కేంద్రంపై అమెరికా జరిపిన బాంబు దాడిలో 68మంది నిర్బంధ వలసదారులు మరణించినట్లు యెమెన్‌లోని తిరుగుబాటు ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో జరిగిన ఈ దాడి అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించిన సంగతి తెలిసిందే.
హౌతీలు వలసదారులను బంధిస్తున్న నిర్బంధ కేంద్రంపై అమెరికా దాడి చేసిందని ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగెస్ కల్లామర్డ్ అన్నారు. మృతులంతా ఆఫ్రికన్ దేశాల నుండి వచ్చిన వలసదారులని హౌతీలు ప్రకటించారని అన్నారు. ఈ దాడిలో పౌరనష్టం జరగడంతో అమెరికా అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించిందా లేదా అనే అంశంపై తీవ్ర ఆందోళనలను లేవనెత్తుతోందని అన్నారు. ఈ వైమానిక దాడిపై అమెరికా సత్వర, స్వతంత్ర మరియు పారదర్శక దర్యాప్తును నిర్వహించాలని అన్నారు. దాడి జరిగిన ప్రదేశానికి చెందిన ఉపగ్రహ చిత్రాలు, ఫుటేజీలను విశ్లేషించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది.
లక్ష్యంగా చేసుకున్న జైలు ఆవరణలో చట్టబద్ధమైన సైనిక లక్ష్యాన్ని గుర్తించలేకపోయామని అమెరికా రక్షణ అధికారులు పేర్కొన్నారని, ఇది ఉల్లంఘనేనని పేర్కొంది. పౌరులు మరియు పౌరవస్తువులు, చట్టబద్ధమైన సైనిక లక్ష్యాల మధ్య తేడాను గుర్తించడంలో విఫలమైన ఏదైనా దాడి, ఒకే ప్రదేశంపై విచక్షణారహిత దాడి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆమ్నెస్టీ స్పష్టం చేసింది.