ఎఫ్-35 యుద్ధ విమానాల మోహరింపు
వాషింగ్టన్ : వెనిజులాలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వారిపై పోరాడే పేరుతో ఎఫ్-35 యుద్ధ విమానాలను పుయర్టో రికోలో మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఆదేశించారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై ఒత్తిడి పెంచడానికి ట్రంప్ ఈ ఎత్తుగడ పన్నారని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పది యుద్ధ విమానాలను పుయర్టో రికో వైమానిక క్షేత్రానికి పంపడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాటిన్ అమెరికాకు చెందిన మాదక ద్రవ్యాల వ్యాపారులు వెనిజులాలో కార్యకలాపాలు సాగిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఈ వ్యాపారులను ‘నార్కో-ఉగ్రవాద’ సంస్థలుగా చూపుతోంది. వెనిజులా భూభాగంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై దాడులు చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోందని సీఎన్‌ఎస్ వార్తా సంస్థ తెలిపింది.
వెనిజులాలోనూ, మొత్తంగా లాటిన్ అమెరికాలోనూ హింసకు ఆజ్యం పోసే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని అమెరికాను మదురో హెచ్చరించారు. సార్వభౌమత్వాన్ని, శాంతి హక్కును, స్వతంత్రతను అమెరికా గౌరవించాలని హితవు పలికారు. ‘నేను ట్రంప్‌ను గౌరవిస్తాను. మా మధ్య విభేదాలు సైనిక ఘర్షణకు దారితీయకూడదు’ అని అభిప్రాయపడ్డారు. చర్చలకు వెనిజులా ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. ఒకవేళ వెనిజులాపై దాడి జరిగితే అది వెంటనే సాయుధ ఆందోళనకు దారితీస్తుందని మదురో ఈ వారం ప్రారంభంలోనే చెప్పారు.
అయితే వెనిజులాలో అధికార మార్పిడి గురించి అమెరికా మాట్లాడడం లేదని ట్రంప్ అన్నారు. అక్కడ స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని మాత్రమే కోరుకుంటోందని తెలిపారు.వెనిజులా ప్రాదేశిక జలాల వెలుపల అమెరికా ఇప్పటికే యుద్ధ విమానాలను, నౌకాదళ సిబ్బందిని, అణుశక్తితో అత్యంత వేగంగా దాడి చేయగల జలాంతర్గాములను మోహరించింది.
కాగా తన క్షిపణి విధ్వంసక యూఎస్‌ఎస్ జాసన్ దన్‌హామ్ సమీపంలో ఎగిరేందుకు వెనిజులా రెండు ఎఫ్-16 ఫైటర్ విమానాలను పంపి కవ్వింపు చర్యలకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది. వెనిజులా జెట్ విమానాలు తమ నౌకలకు హాని కలిగిస్తాయని షిప్ కమాండర్లు భావిస్తే వాటిని కూల్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని ట్రంప్ చెప్పారు.
వెనిజులాపై దాడులకు అమెరికా యత్నాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES