– చైనాను సంప్రదించిన అమెరికా
బీజింగ్: ట్రంప్ టారిఫ్‌పై భారత్‌తో సహా పలు దేశాలు మైత్రి కోసం వెంపర్లాడుతుంటే.. మరి కొన్ని దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే చైనాను టార్గెట్ చేయాలని అమెరికా వేసిన వ్యూహం బెడిసికొట్టినట్టు స్పష్టమవుతోంది. ఓ వైపు ఆర్థిక మాంద్యం, అస్థిర నిర్ణయాలతో యూఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతోందని ఆర్థికవేత్తల హెచ్చరికలతో..అమెరికా అధ్యక్షుడు మెత్తబడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా టారిఫ్‌లపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతినకుండా ఈ చర్యలు చేపట్టినట్టు అభివర్ణించింది.
ట్రంప్ సర్కారు ఇప్పటికే చైనా వస్తువులపై ఏప్రిల్‌లో 145శాతం సుంకాలు విధించింది. దీనికి ప్రతి స్పందనగా బీజింగ్ కూడా అగ్రరాజ్య వస్తువులపై 125శాతం సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు వివిధ మార్గాల్లో చైనీయులను సంప్రదించినట్టు సీసీటీవీ పేర్కొంది. సంప్రదింపుల కోసం అమెరికానే ఆత్రుతతో ఎదురు చూస్తోందని వెల్లడించింది. ట్రంప్ కార్యవర్గం తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పింది. ఈ విషయంపై చైనా విదేశాంగశాఖ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు చైనానే టారిఫ్‌లపై చర్చల కోసం తీవ్ర స్థాయిలో యత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. బుధవారం కూడా ఆయన మాట్లాడుతూ డీల్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలున్నా యని చెప్పారు. ”చర్చల్లో మా నిబంధనలకు లోబడే ఒప్పందం చేసుకోనున్నాం. అదే మంచిది” అని ఆయన న్యూస్‌నేషన్ టౌన్ హాల్ కార్యక్రమంలో వెల్లడించారు. దాదాపు వారం రోజుల క్రితం ట్రంప్ ఇటువంటి ప్రకటనే చేయగా.. చైనా బహిరంగంగానే ఖండించింది. నాడు బీజింగ్ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ ”ఇరు దేశాల మధ్య సంప్రదింపులు ఏమీ జరగడం లేదు. వాణిజ్య ఒప్పందం కుదరలేదు” అని చెప్పారు. అయితే ఈ అంశంపై భవిష్యత్తులో చర్చలకు సిద్ధమే అని చెప్పడం విశేషం.
టారిఫ్‌లపై చర్చిద్దాం రండి
- Advertisement -
RELATED ARTICLES