నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని.. అమెరికా, భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇటీవల అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలన్నీ ఆందోళన కలిగించాయని అన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చిన అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమయ్యారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన ప్రతినిధులు 16 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు
చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ సారధ్యంలో ఈ ప్రతినిధి బృందం భారత్ లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.
