నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇరాన్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత కోసం భారత రాయబార కార్యాలయాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. అందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించాయి.
ఖతార్‌లోని దోహాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఒక కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది. “ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి దృష్ట్యా, ఖతార్‌లోని భారత పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంబసీ, స్థానిక అధికారులు జారీ చేసే వార్తలు, సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి” అని పేర్కొంది. ప్రజల భద్రత దృష్ట్యా సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని, ఇళ్లు లేదా ఇతర భవనాల్లోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని స్థానిక అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పాటించాలని కోరింది.
ఇదే తరహాలో యూఏఈలోని భారత రాయబార కార్యాలయం కూడా అక్కడి భారతీయులకు కీలక సూచనలు చేసింది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, స్థానిక అధికారులు, ఎంబసీ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది. అబుదాబి, దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు టోల్-ఫ్రీ, వాట్సాప్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇక, ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉన్న ఇరాన్‌లోని టెహ్రాన్‌లో భారత ఎంబసీ కూడా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులందరూ అత్యంత జాగరూకతతో ఉండాలని, అనవసరంగా బయట తిరగవద్దని, వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. స్థానిక పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, తదుపరి మార్గదర్శకాల కోసం వేచి చూడాలని కోరుతూ ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలను అందించింది.



