Wednesday, December 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌..3,000 డాలర్లు ఇస్తాం

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌..3,000 డాలర్లు ఇస్తాం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఈ ఏడాది ముగింపు లోగా స్వచ్ఛందంగా అమెరికాను వీడేందుకు అంగీకరించే అక్రమ విదేశీ వలసదారులకు 3,000 డాలర్లు(రూ.2.68 లక్షలు), ప్రయాణ ఖర్చులను చెల్లిస్తామని ట్రంప్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అక్రమ వలసదారుల తరలింపును వేగవంతం చేసి బలవంతపు తరలింపు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా అమెరికా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద సీబీపీ హోం యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛందంగా అమెరికాను వీడేందుకు ముందుకు వచ్చే అక్రమ వలసదారులకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో పాటు నగదు కూడా చెల్లిస్తుంది.

గతంలో జరిమానాలు ఏవైనా విధించి ఉంటే వాటిని కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మేలో ప్రకటించిన 1,000 డాలర్ల సహాయం కన్నా మూడు రెట్లు అధికంగా సహాయం చేయనున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ వివరించింది. క్రిస్మస్‌ సెలవుల సీజన్‌ కావడంతో ఈ సమయంలోనే సాధ్యమైనంత ఎక్కువ మంది అక్రమ వలసదారుల బెడదను వదిలించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు ఇప్పటికైనా దేశాన్ని వీడకపోతే ఏ దేశానికి చెందని వారిగా మిగిలిపోతారని కూడా హెచ్చరించింది. ఈ బహుమతిని అవకాశంగా తీసుకుని అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడాలని, లేకపోతే వారిని అరెస్టు చేస్తామని హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్‌ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -